ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

  • Published By: chvmurthy ,Published On : January 10, 2020 / 02:25 PM IST
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ  శుక్రవారం  సాయంత్రంతో ముగిసింది. 15 వేలకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. నామినేషన్లు మొదలైన రోజు కేవలం 967 నామినేషన్లు మాత్రమే దాఖలవ్వగా…. రెండో రోజు 4,772 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజైన ఈ రోజు 10 వేలకు పైగా నామినేషన్లు వేశారు.

9 కార్పోరేషన్లు, 120 మున్సిపాలిటీలకు ఈ నెల 22వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. 25వ తేదీన ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం 325 కార్పోరేషన్లు, 2727 కౌన్సిలర్‌ డివిజన్లుకు ఎన్నికలు జరుగుతాయి. 

శనివారం అధికారులు నామినేషన్ల పరిశీలన జరుపుతారు. నామినేషన్ల ఉపసహరణకు ఈ నెల 14వ తేదీ వరకు గడువు ఉంది. బీ ఫారాల విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే వరకు బీ ఫారాలు ఇవ్వొచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు బీ ఫారాలు ఇవ్వొచ్చని పేర్కొంది.

కరీంనగర్ లో 12 వరకు నామినేషన్లు 
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మొదట కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వని రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం,జనవరి9న నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారం 10వ తేదీ స్థానికంగా రిటర్నింగ్ అధికారులు ఎన్నిక నోటీసు జారీ చేశారు. కరీంనగర్ లో కార్పొరేటర్ పదవుల కోసం ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించారు. అక్కడ ఈనెల 12వ తేదీ వరకు  గడువు ఉంది.