Railways Stolen : రైలులో చోరీ జరిగితే రైల్వేదే బాధ్యత, ప్యాసింజర్‌కు రూ.17లక్షలు చెల్లించాలని వినియోగదారుల ఫోరం ఆదేశం

రైలులో ప్రయాణికురాలి లగేజీ చోరీ అయిన కేసులో నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ లోని వినియోగదారుల ఫోరం కీలక తీర్పు ఇచ్చింది. రైలులో చోరీ జరిగితే రైల్వేదే బాధ్యత అని తేల్చి చెప్పింది.

10TV Telugu News

Railways Stolen : రైలులో ప్రయాణికురాలి లగేజీ చోరీ అయిన కేసులో నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ లోని వినియోగదారుల ఫోరం కీలక తీర్పు ఇచ్చింది. రైలులో చోరీ జరిగితే రైల్వేదే బాధ్యత అని తేల్చి చెప్పింది. ప్రతి ప్రయాణికుడు వినియోగదారుడే అని, భద్రత కల్పించాల్సిన బాధ్యత రైల్వే వర్గాలదే అని స్పష్టం చేసింది. అంతేకాదు చోరీకి గురైన నగల విలువ, నగదును ప్యాసింజర్ కు చెల్లించాల్సిందే అని వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చింది.

హైదరాబాద్ నగరానికి చెందిన శీతల్‌ ముఖర్జీ బెంగళూరులో ఉన్న తన ఆడపడుచు నిశ్చితార్థానికి బంధువులతో కలిసి హాజరయ్యేందుకు 2017 ఆగస్టు 11న యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-9 స్లీపర్‌ కోచ్‌లో 57, 58, 60, 62, 64, 69 బెర్త్‌లను రిజర్వ్‌ చేసుకున్నారు. నిశ్చితార్థానికి అవసరమైన ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌, నగలు, రూ.3 లక్షలు సూట్‌కేసులో భద్రపరిచి తీసుకెళ్లారు. ఆ తర్వాతి రోజు బెంగళూరులో రైలు దిగి ఆడపడచు ఇంటికి వెళ్లి చూడగా.. సూట్‌కేసు కింది భాగానికి కన్నం వేసిన దుండగులు.. రూ. 14.01 లక్షలు విలువ చేసే నగలు, రూ.3 లక్షలు, పట్టుచీరలు దొంగిలించినట్లు గుర్తించారు.

అదే రోజు సాయంత్రం యశ్వంత్‌పూర్‌ రైల్వే పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. పోలీసులను పలుమార్లు సంప్రదించినా ఎలాంటి స్పందన లేకపోవడంతో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఫోరం-2 ప్రెసిడెంట్‌ జస్టిస్‌ వక్కంటి నర్సింహారావు, సభ్యులు జస్టిస్‌ పీవీటీఆర్‌ జవహర్‌బాబు, జస్టిస్‌ ఆర్‌ఎస్‌ రాజశ్రీతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది.

ఈ సందర్భంగా రైల్వే పోలీసులు తమ వాదనలు వినిపిస్తూ.. చోరీ బెంగళూరులో జరగడం వల్ల కేసును అక్కడి ఫోరానికి బదిలీ చేయాలని కోరారు. తాము గవర్నమెంట్‌ రైల్వే పోలీసు(జీఆర్పీ)అని, రైల్వేతో సంబంధం ఉండదని వివరించారు. రిజర్వ్‌ అయిన లగేజీకే తమ భద్రత ఉంటుందని, ప్రయాణికుల వ్యక్తిగత సామగ్రి భద్రతకు ఉండదని చెప్పారు. తాము విలువైన వస్తువులు తీసుకెళ్తున్నామని ముందుగా పోలీసులకు సమాచారం అందజేయలేదని వివరించారు. బాధితురాలు స్టేషన్‌ నుంచి బయటకు వెళ్లాక చోరీ జరిగి ఉండొచ్చు కదా? అని అనుమానం వ్యక్తం చేశారు.

దీనికి బాధితురాలు స్పందిస్తూ.. ‘‘మేము ప్రయాణించింది రిజర్వ్‌ బోగి. అందులో టికెట్‌ రిజర్వ్‌ కాని వారు.. ఆగంతుకులు కూడా తచ్చాడారు. అలాంటి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత రైల్వే సిబ్బందిదే. కొంతమంది ప్లాట్‌ఫాం టికెట్‌తో రిజర్వ్‌ బోగీల్లోకి చొరబడుతున్నారు. సరైన భద్రత లేని కారణంగానే నగలు, నగదు చోరీ అయ్యాయి’’ అని వాదనలు వినిపించారు.

దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ప్రతి ప్రయాణికుడు వినియోగదారుడేనని అంది. ‘‘రిజర్వ్‌ బోగీల్లో సరైన భద్రతా ఏర్పాట్లు లేవు. చోరీకి గురైన నగల విలువ రూ.14,01,078తో పాటు, రూ. 3 లక్షలు, 9శాతం వడ్డీ కలిపి 45 రోజుల్లో చెల్లించాలి. ఫిర్యాదుదారును మానసిక వేదనకు గురి చేసినందుకు రూ.50 వేల పరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ. 5 వేలు చెల్లించాలి’’ అని రైల్వే శాఖను ఆదేశించింది. వినియోగదారుల ఫోరం తీర్పు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మన దేశంలో చాలామంది దూర ప్రయాణాలకు రైలునే ఎంచుకుంటారు. అయితే కొన్ని రైళ్లోల సరైన భద్రత ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రయాణికుల లగేజి చోరీ అవుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం ఉండటం లేదు. రైలులో చోరీలు జరక్కుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.