దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన

  • Published By: madhu ,Published On : April 19, 2019 / 12:19 PM IST
దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన

దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. దక్షిణ కేరళలో అత్యధికంగా వర్షాలు ఉంటాయని పేర్కొంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో చిరు జల్లులు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 40-50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. 

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్లతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అకాల వర్షాలకు పంటలు నీట మునుగుతుండగా, ధాన్యం తడిసిపోతోంది. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్, కోహెడ మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్లు విరగగా ఇళ్లపై కప్పులు ఎగిరిపోయాయి. 

క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో ఒకటి రెండు చోట్ల వర్షాలు పడే ఛాన్స్ ఉందని..వాతావరణ శాఖ పేర్కొంది. ప్రకాశం, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్‌లో 38 నుండి 40 డిగ్రీల మేర టెంపరేచర్ నమోదవుతుందని తెలిపింది. గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న వర్షాలతో జనాలు ఎంజాయ్ చేస్తున్నారు.