చలి చాలదన్నట్టు : హైదరాబాద్ లో అకాల వర్షం

  • Published By: veegamteam ,Published On : December 31, 2019 / 12:24 PM IST
చలి చాలదన్నట్టు : హైదరాబాద్ లో అకాల వర్షం

చలి చంపేస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఎముకలు కొరికే చలితో హైదరాబాద్ వాసులు గజగజ వణుకుతున్నారు. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు వర్షం కూడా తోడైంది. హైదరాబాద్ నగరంలో అకాల వర్షం కురిసింది. మంగళవారం(డిసెంబర్ 31,2019) సాయంత్రం 5.30గంటల సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడింది. మోస్తరు వర్షం కురిసింది. దీంతో రహదారులపై నీరు ప్రవహించింది. ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

మంగళవారం ఉదయం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో చినుకులు పడ్డాయి. అకాల వర్షంతో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. వాతావరణం మరింత కూల్ గా మారింది. తీవ్రమైన చలి గాలులతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఓవైపు చలి, మరోవైపు వర్షంతో నగరవాసులు అవస్థలు పడ్డారు. ఉదయం స్కూళ్లకు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే వారు చల్లటి వాతావరణంతో ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోనే కాదు ఏపీలోనూ ఇదే పరిస్థితి. ఓవైపు చలి మరోవైపు వర్షం. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో… కోస్తాంధ్ర జిల్లాలో వానలు కురుస్తున్నాయి. రెండు రోజలు పాటు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ వాఖ అధికారులు చెప్పారు. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదైనా, మేఘాల ప్రభావం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని తెలిపారు.

Also Read : పొలిటికల్ రౌండప్ 2019 : దేశ రాజకీయాల్లో మొదటిసారి జరిగిన విశేషాలు