తీరం దాటిన హికా : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవవు – వాతావరణ శాఖ

  • Published By: madhu ,Published On : September 27, 2019 / 05:58 AM IST
తీరం దాటిన హికా : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవవు – వాతావరణ శాఖ

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పడుతాయని, భారీ వర్షాలు పడే అవకాశం లేదని హైదరాబాద్ వాతావరణ శాఖాధికారి రాజారాం ప్రకటించారు. సెప్టెంబర్ 27 శుక్రవారం, సెప్టెంబర్ 28 శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. హికా తుపాన్ 24 రాత్రి తీరం దాటిపోయిందని, దీనివల్ల ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదంటున్నారు. గల్ఫ్ తీరం వైపు పయనించడం వల్ల దేశంపై ఎలాంటి ప్రభావం చూపించదన్నారు. 

కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న ప్రచారంతో ప్రజలు భయాందోనళకు గురవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ అధికారి రాజారాంతో 10tv మాట్లాడింది. దక్షిణ మహారాష్ట్ర దీనిని ఆనుకుని ఉన్న గోవా, కర్నాటక, తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. 24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. 

2018లో మే నెలలో కేరళను రుతుపవనాలు తాకితే..ఈ సంవత్సరం జూన్ నెలలో తాకాయన్నారు. జూన్ 21న కోస్తా, రాయలసీమలో జూన్ 22న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయన్నారు. పశ్చిమ, ఉత్తర తెలంగాణాల్లో సెప్టెంబర్ 27వ తేదీన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, సెప్టెంబర్ 28 నుంచి తేలిక పాటి నుంచి వర్షాలు కురుస్తాయన్నారు.