తెలంగాణలో రెండ్రోజులు మోస్తారు వర్షాలు

  • Published By: veegamteam ,Published On : April 21, 2019 / 02:16 AM IST
తెలంగాణలో రెండ్రోజులు మోస్తారు వర్షాలు

తెలంగాణలోని పలు చోట్ల ఆదివారం (ఏప్రిల్ 21, 2019) నుంచి రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీస్తాయని వెల్లడించింది. ఈ రెండ్రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 

ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక వరకు తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా 1.5 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని చెప్పారు. ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో అధిక ఉష్ణోగ్రతలతో పాటు చెదురుముదురుగా వర్షాలు పడతాయని తెలిపింది. 

హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతుండటంతో రాష్ట్రంలో పలు చోట్ల 2 నుంచి 3 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఘన్‌పూర్‌ 3, చౌటుప్పల్‌ 2, నర్మెట్ట 2, యాచారం 2, పాలకుర్తి 2, యాదగిరి గుట్ట 2, మర్రిగూడ 2, బెజ్జంకి 2, ధర్మసాగర్‌ 2, కాగజ్‌నగర్‌ 2, మహబూబాబాద్‌ 2, జఫర్‌గఢ్‌ 2, వర్గల్‌ 1 సెం.మీ చొప్పున వర్షపాత రికార్డు అయింది.