110 ఏళ్ల తర్వాత : నగరంలో రికార్డు స్థాయి వర్షం

  • Published By: madhu ,Published On : September 25, 2019 / 04:32 AM IST
110 ఏళ్ల తర్వాత : నగరంలో రికార్డు స్థాయి వర్షం

రికార్డుస్థాయి వర్షపాతం హైదరాబాద్‌ను వణికించింది. కాలనీలు చెరువులయ్యాయి. రహదారులు కాలువలయ్యాయి. గత కొన్నేళ్లలో ఎన్నడూ చూడనంత వర్షం కురవడంతో సిటీలోని అన్ని ప్రాంతాలు జలసంద్రమయ్యాయి. 110 ఏళ్ల తర్వాత 24 గంటల్లో అత్యధిక వర్షం కురవడంతో నగరవాసులు నరకం చూశారు. రాత్రంతా భారీగా ఉరుములు, మెరుపులతో నగరం వణికిపోయింది. ఓపక్క ఇళ్లలోకి చేరిన నీరు.. మరోపక్క చెరువుల్లా మారిన రహదారులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లో 1908 సెప్టెంబర్‌ 27న ఆల్‌టైమ్‌ రికార్డుగా 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం 13 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డయ్యింది. 

గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సీజన్‌లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కుండపోత వర్షానికి నగరం చిగురుటాకులా వణికిపోయింది. మధ్యాహ్నం నుంచే హైదరాబాద్ చుట్టూ కారుమబ్బులు కమ్ముకున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆ వర్షానికే నగర జీవనం స్తంభించిపోగా.. కాస్త తెరిపి ఇచ్చినట్లే ఇచ్చిన తర్వాత.. ఆకాశానికి చిల్లు పడినట్లుగా వాన కురిసింది.

384 మాన్‌సూన్‌ బృందాలు రంగంలోకి దిగాయి. బేగంబజార్‌లో కూలడానికి సిద్దంగా ఉన్న భవనాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ సిబ్బంది.. అందులో నివాసం ఉంటున్నవారిని వేరే చోటుకు తరలించారు. ఎలాంటి సమస్యలున్నా ప్రజలు జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌ శాఖ నెంబర్లకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. 
Read More : చెరువుల్లా మారిన రోడ్లు : వాహనదారులకు చుక్కలు

తిరుమలగిరిలో అత్యధికంగా 13 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవగా… అల్వాల్‌, సఫిల్‌గూడలో 12.9, ఉప్పల్‌లో 12.7, దీన్‌దయాళ్‌నగర్‌లో 12.6, చిలుకానగర్‌లో 12, రాంనగర్, ఓయూ, వెస్ట్ మారేడ్‌పల్లి, రామంతాపూర్ ప్రాంతాల్లో 11.4, మల్కాజిగిరి, అడ్డగుట్టలో 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెట్టుగూడలో 10.9, ముషీరాబాద్‌లో 10.6, బేగంపేటలో 10.4, మోండా మార్కెట్‌లో 10.3, హబ్సిగూడలో 10.2, ఓల్డ్ బోయిన్‌పల్లిలో 10, ఏఎస్‌ రావు నగర్‌లో 9.9, బండ్లగూడలో 9.8, కవాడిగూడలో 9.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక.. కాప్రాలో 8.9, జూబ్లీహిల్స్‌లో 8.8, ఖైరతాబాద్‌, అంబర్‌పేటలో 8.5, నాంపల్లి, బంజారాహిల్స్‌లో 8.4 ఎల్బీనగర్‌లో 8.3, మల్లాపూర్‌లో  8, పద్మారావునగర్‌లో 7.7 మాదాపూర్‌లో 7.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.