ఎన్నికల వరకు ఇంతే : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రెడ్ అలర్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : March 5, 2019 / 11:32 AM IST
ఎన్నికల వరకు ఇంతే : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రెడ్ అలర్ట్

2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసేంతవరకు దేశంలో ఇతర ప్రధాన విమానాశ్రయాలతో కలిసి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రమయం(RGIA)లో రెడ్ అలర్ట్ కొనసాగనుంది. బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ విమానాశ్రయంలో ఇటీవల విమానాన్ని హైజాక్ చేసే ప్రయత్నం జరిగిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఇంటిలిజెన్స్ బ్యూరో(IB)ముందు జాగ్రత్త చర్యగా పార్లమెంట్ ఎన్నికలు ముగిసేంతవరకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడ్ అలర్ట్ కొనసాగించాలని నిర్ణయించింది. అంతేకాకుండా జైషే మహమ్మద్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరో ఆత్మాహుతి ఉగ్రదాడికి పాల్పడబోతున్నట్లు అందిన సమాచారం కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో కారణంగా తెలుస్తోంది.

విమానం హైజాక్ చేసే అవకాశముందని అలర్ట్ వచ్చిందని, ముందుజాగ్రత్త చర్యలో భాగంగానే తాము రెడ్ అలర్ట్ కొనసాగినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. విమానాశ్రయాల్లోని భధ్రతా సిబ్బంది సెక్యూరిటినీ మరింత మెరుగుపర్చాలని గత వారమే అలర్ట్ జారీ అయింది.  ఇప్పటికే RGIAతో సహా మరికొన్ని విమానాశ్రయాల్లో మార్చి-1నుంచి  సందర్శకుల ఎంట్రీపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(BCAS)నిషేధం విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సందర్శకులకు ఎంట్రీ పాస్ ఇవ్వకూడదని ఎయిర్ పోర్ట్ అధికారులకు బీసీఏఎస్ సూచించింది. విమానాశ్రయాల్లో భధ్రతను నిర్వహించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)..విమానాశ్రయాల్లో యాంటీ టెర్రరిజమ్ మెకానిజమ్,కౌంటర్ టెర్రరిస్ట్ ప్లాన్ తో పూర్తి యాక్టివేటెడ్ గా ఉందని న్యూఢిల్లీకి చెందిన సీఐఎస్ఎఫ్ అధికారి తెలిపారు.