తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం : గవర్నర్  

హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు.

  • Published By: veegamteam ,Published On : January 26, 2019 / 07:30 AM IST
తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం : గవర్నర్  

హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు.

హైదరాబాద్ : తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కొనియాడారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రాభివృద్ధి దూసుకుపోతోందన్నారు.

 

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోందని చెప్పారు. మిషన్ కాకతీయలో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. మార్చి నెలాఖరులోగా మిషన్ భగీరథ పనులు పూర్తి అవుతాయని.. అందరికీ సురక్షిత మంచినీళ్లు అందుతాయని తెలిపారు. కొత్త పవర్ ప్లాంట్లు వేగంగా నిర్మితమవుతున్నాయని చెప్పారు. నిరంతరాయంగా 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని తెలిపారు.

 

రాష్ట్రంలో రూ.40 వేల కోట్ల సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. రైతు బంధు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైందని పేర్కొన్నారు. రైతు బంధును ఐక్యరాజ్య సమితి ప్రశంసించిందని వెల్లడించారు. ధరణి వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పారదర్శకత ఉందన్నారు.