పచ్చదనమే ప్రాణం పోస్తుంది.. కరోనా తగ్గేవరకూ సిటీల్లోకి అడుగుపెట్టబోమంటోన్న బడాబాబులు

పచ్చదనమే ప్రాణం పోస్తుంది.. కరోనా తగ్గేవరకూ సిటీల్లోకి అడుగుపెట్టబోమంటోన్న బడాబాబులు

ఎంత డబ్బున్నా.. ఎలాంటి బడాబాబులైనా సరే సిటీ చివర్లోనే మకాం. ప్రాణాలతో బతికి ఉంటే చాలు పట్నం ఊసే వద్దు అనుకుంటున్నారు. వ్యాపారవేత్తల ఆలోచనా తీరు ఇలా ఉంది. తమకు తెలిసిన వారు.. తమలాగే తిరిగేవారు కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతుండటంతో ఆలోచనా తీరు మారింది. కరోనా తగ్గుముఖం పట్టే వరకూ నగరానికి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు.

వీకెండ్‌ పార్టీలకు, సోషల్‌ గేదరింగ్స్‌ కాలం చెల్లింది. సందర్భం ఏదైనా పార్టీల్లో మునిగి తేలే కల్చర్, వ్యాపార విజయాలను వినూత్నంగా వేడుక చేసుకునే బడా వ్యాపార వేత్తలు.. ఇలా అందరూ సైలెంట్‌ అయిపోయారు. పదుల సంఖ్యలో పార్టీ ప్రియులు, వ్యాపారవేత్తలు నగర శివార్లలోని ఫామ్‌ హౌజ్‌లకు తరలి వెళ్లారు. అదీ పూర్తి సరంజామాతో!

రోజురోజుకీ పెరిగిపోతున్న కొవిడ్‌-19 కేసులు, రికమెండేషన్‌లు పెట్టుకున్నా బెడ్‌లను సైతం బ్లాక్‌లో అమ్ముకుంటున్న ప్రైవేట్‌ హాస్పిటల్స్‌.. అంతా చేసినా బతికొస్తామన్న ఆశ లేకుండా చేస్తున్న మహమ్మారి.. చస్తూ బతకడం కన్నా జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తూ బతకాలంటూ ఫామ్‌హౌ్‌సలకు చేరిపోతున్నారు.

గతంలో వారాంతాల్లో మాత్రమే ఫామ్‌హౌ్‌సలలో సందడి చేసే వారు రాజేంద్రనగర్‌ సర్కిల్‌ మైలార్‌దేవుపల్లికి చెందిన ఓ వ్యాపారి మూడు నెలలుగా షాద్‌నగర్‌లోని ఓ గ్రామంలో తమ ఫామ్‌ హౌజ్‌లోనే ఉంటున్నారు. నాలుగేళ్ల క్రితం గుండె ఆపరేషన్‌ కావడం.. కరోనా ప్రభావం ఈ తరహా రోగులపై ఎక్కువగా ఉండటం వల్ల ఆయన కుటుంబ సభ్యులు పట్టుబట్టి మరీ ఫామ్‌ హౌజ్‌కు మకాం మార్చారు. తమకు కావాల్సినవన్నీ పూర్తిగా శానిటైజ్‌ చేసిన తరువాత మాత్రమే ఫామ్‌హౌస్‌ లోపలకు అనుమతిస్తున్నారు. చిన్నచిన్న పనులను తమ వ్యవసాయ క్షేత్రంలో ఉండేవారితోనే చేయిస్తున్నారు.

ఇదే రీతిలో కార్యకలాపాలను సైతం చక్కబెట్టుకుంటున్నారు చాలామంది. ఐరన్‌, శానిటరీ తదితర వ్యాపార విభాగాల్లో ఎక్కువగా కనిపించే ఓ కమ్యూనిటీకి చెందిన వ్యాపార వర్గాలు తమకు సహజంగానే కాస్త రోగ నిరోధక తక్కువని, కరోనాలాంటి వ్యాధులు వస్తే తట్టుకోవడం తమకు కష్టమేనన్న ఒకే ఒక్క కారణంతో ఫామ్‌ హౌజ్‌లకు చేరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి కన్నా.. శివార్లలోని గెస్ట్‌హౌసే పదిలమనిపిస్తోందని వారి అభిప్రాయం.

నగరం నుంచి శివార్లకు వెళ్తున్న వారిలో కరోనా భయమే తొలి కారణమైనా, భయానికి దూరంగా.. ప్రకృతి ఒడిలో సేద తీరవచ్చనే భావనా తొణికిసలాడుతోంది. ఆఫీసులు దాదాపుగా పని చేయడం లేదు. ఎక్కువ మంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లోనే ఉన్నారు. వ్యాపార వర్గాల్లో అధికశాతం సహాయకులకే విధులను అప్పగించి శివార్లలో గడుపుతున్నారు. తమ వ్యాపార కార్యకలాపాలను తన ముగ్గురు అసిస్టెంట్లు చూసుకుంటున్నారని, బ్యాంకు పనులు తప్పదనుకుంటేనే తాను వెళ్తున్నానన్నారు శంషాబాద్‌ సమీపంలోని తన ఐదెకరాల వ్యవసాయక్షేత్రానికి మకాం మార్చిన ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారి అంటున్నారు.

మూడు ఎకరాల్లో వరి, మిగిలిన దానిలో పండ్ల చెట్లు పెంచుతున్నామన్న ఆయన భయానికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా మాస్కులు కూడా లేకుండా ఇక్కడ ఉండగలుగుతున్నామన్నారు. నిజానికి ఈ ఫామ్‌హౌస్‌ స్టేలను తమకన్నా తమ పిల్లలు ఎక్కువగా ఆస్వాదిస్తున్నారన్నారు. వ్యాక్సిన్‌ వచ్చిందనే వార్త వినబడే వరకూ నగరానికి రావాలనుకోవడం లేదని వారు చెప్పడం గమనార్హం.