మిలమిలా మెరిసిపోతాయ్ : హైదరాబాద్ లో ప్రైవేట్ రోడ్లు 

  • Published By: veegamteam ,Published On : December 4, 2019 / 05:26 AM IST
మిలమిలా మెరిసిపోతాయ్ : హైదరాబాద్ లో ప్రైవేట్ రోడ్లు 

హైదరాబాద్ రోడ్లు ప్రైవేటు పరం కానున్నాయి. హైదరాబాద్ రోడ్ల నిర్మాణాలను ప్రభుత్వం  ప్రైవేటు సంస్థలకు అప్పగించనుంది. వాటి నిర్వహణకూడా  ప్రైవేటు సంస్థలే చూసుకుంటాయి. దీంతో ఇకపై నగరంలోని రోడ్లన్నీ ఇకపై మిలమిలా మెరిసిపోనున్నాయన్నమాట. రోడ్లపై గుంత అనేది కనిపించవన్నమాట.

హైదరాబాద్ లోని 709 కిలో మీటర్ల మెయిన్ రోడ్లను ప్రైవేటు సంస్థలు నిర్మించనున్నాయి. దీని కోసం ప్రభుత్వం రూ.1800 కోట్లను కేటాయించనుంది. దీంట్లో భాగంగా జోన్ల వారీగా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తైంది. ఈ కాంట్రాక్టుని ప్రభుత్వం బడా సంస్థలకు అప్పగించింది. దీనికి సంబంధించి ఇప్పటికే నాలుగు ప్యాకేజీలకు జీవోలు జారీ అయ్యాయి. మరో మూడు ప్యాకేజీలు ఆర్థిక శాఖ అనుమతి రాగానే జీవోలు జారీ కానున్నాయి. అనంతరం కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అమలులోకి రానుంది. అనంతరం టెండర్లు దక్కించుకున్న సంస్థలు పనుల్ని ప్రారంభించనున్నాయి. 

నగరంలోని రోడ్లను ఎప్పటికప్పుడు కొత్తగా నిర్మించినా..మరమ్మతు పనులు చేపట్టినా అదే పరిస్థితి. గుంతల రోడ్లతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రోడ్ల నిర్మాణం..వాటి నిర్వహణ అంతా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తోంది. 709 కిలోమీటర్ల ప్రధాన రహదారుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించనుంది. ఐదేళ్లలో నిర్మాణం, నిర్వహణకుగానూ రూ.1800 కోట్లు ఖర్చు చేయనున్నారు. రోడ్ల నిర్మాణం, గుంతల పూడ్చివేత, మరమ్మతు వంటి పనులు కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలే చూసుకుంటాయి. 

హైదరాబాద్ రోడ్లంటే ఎవ్వరైనా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. విశ్వనగరంగా అభివృద్ది చెందుతున్న క్రమంలో వర్షాకాలం వచ్చిదంటే హైదరాబాద్ రోడ్లపై ప్రయాణించాలంటే నడుములు విరిగిపోతున్న పరిస్థితి. రోడ్లపై ఉండే గుంతల్లో పడి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కూడా లేకపోలేదు. కొంతమందికి కాళ్లు చేతులు విరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో రోడ్ల నిర్మాణాలు ప్రైవేటు సంస్థల చేతికి వెళ్లటంతో  చక్కటి రోడ్లు అందుబాటులోకి రానున్నాయి. 

కాగా.. నగరంలోని పలు కాలనీలు, బస్తీల్లోని రోడ్ల నిర్వహణ ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నప్పటికీ మున్ముందు ఇదీ ప్రైవేటుపరం అయ్యే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.