విలీనం డిమాండ్‌పై వెనక్కి తగ్గిన ఆర్టీసీ జేఏసీ

  • Published By: madhu ,Published On : November 14, 2019 / 01:38 PM IST
విలీనం డిమాండ్‌పై వెనక్కి తగ్గిన ఆర్టీసీ జేఏసీ

ఆర్టీసీ జేఏసీ కొంత పట్టు సడలించింది. డిమాండ్లలో ప్రధానమైన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కీలక నిర్ణయం తీసుకుంది. 2019, నవంబర్ 14వ తేదీ గురువారం వివిధ విపక్ష నేతలతో ఆర్టీసీ జేఏసీ సమావేశమైంది. సమ్మె, కోర్టులో విచారణ, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మీడియాతో మాట్లాడారు. విలీనం అనే ప్రధానమైన డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కకు పెట్టినట్లు కీలక ప్రకటన చేశారు. మిగతా సమస్యలపై చర్చించి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. 

మరోవైపు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఆర్టీసీపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ తీసుకున్న కీలక నిర్ణయంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తోనన్న ఉత్కంఠ నెలకొంది. 

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. నవంబర్ 14వ తేదీకి 41 రోజులకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మె, జీతాల విషయం, రూట్ల ప్రైవేటీకరణ, తదితర అంశాలపై కోర్టులో విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు ప్రతిపాదనకు సర్కార్ నో చెప్పింది. పలు అంశాలపై తీర్పును వాయిదా వేసింది కోర్టు. ఆర్టీసీ జేఏసీ నేతలను ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందా ? అనేది చూడాలి. 
Read More : గృహప్రవేశం : చిత్తారమ్మ బస్తీలో డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభం