ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: మతి స్థిమితం కోల్పోయిన కండెక్టర్

  • Published By: vamsi ,Published On : November 8, 2019 / 05:05 AM IST
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: మతి స్థిమితం కోల్పోయిన కండెక్టర్

ఆర్టీసీ కార్మికులు నవంబర్ 5వ తేదీ లోపు జాయిన్ అవండి. యూనియన్లు, విపక్షాల మాయలో పడకండి అని పిలుపునిచ్చారు కేసీఆర్. ఆర్టీసీ కార్మికులు మాత్రం కొందరు డ్యూటీల్లో చేరుతుంటే, మరికొందరు మాత్రం అందుకు ఒప్పుకోట్లేదు. మీ కుటుంబాలను మీరు కాపాడుకోండి ఉద్యోగం పోతే ఇబ్బందులు తప్పవు అని కేసిఆర్ చెప్పినట్లు బయట పరిస్థితి రోజురోజుకు తయారవుతుంది. ఇఫ్పటికే ఆత్మహత్యలు చేసుకుని కొందరు చనిపోయారు.

రెండు నెలల నుంచి జీతం లేదు. ఇళ్లలో పూట గడిచే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే ఆర్టీసీ సమ్మె ముగియకుంటే జీవితాలు ముగిసిపోయేట్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. లేటెస్ట్‌గా ఆర్టీసీ సమ్మె కారణంగా ఓ కండెక్టర్ మతి స్థిమితితం కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ డిపోలో పనిచేస్తున్న కండక్టర్‌ నాగేశ్వర్‌(45) జోగిపేటకు చెందిన సుజాతను 18ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. సంగారెడ్డిలోని అద్దె ఇంట్లో ఉంటూ జీవస్తున్నాడు.

ఆర్టీసీ కండెక్టర్‌గా పనిచేస్తున్న నాగేశ్వర్‌ కుటుంబంలో అతను ఉద్యోగానికి వెళ్తేనే కుటుంబం గడుస్తుంది. ఈ క్రమంలో సమ్మె కారణంగా తీవ్ర ఆందోళనకు గురయ్యాడు నాగేశ్వర్. తీవ్రంగా ఆలోచించడంతో అతని ప్రవర్తనలో తేడా వచ్చింది. ఇటీవల కేసీఆర్ 5వ తేదీని డెడ్ లైన్‌గా విధించగా అప్పటి నుంచి తన భర్త మతి స్థిమితితం కోల్పోయినట్లు భార్య సుజాతా చెబుతోంది. కడుపునిండా తిని 20 రోజులయ్యిందని నాగేశ్వర్‌ భార్య సుజాత కన్నీటి పర్యాంతం అవుతున్నారు.

నాలుగు రోజులనుంచి నాగేశ్వర్‌ టికెట్‌.. టికెట్‌.. బస్‌ ఆగింది. దిగండి. రైట్‌ రైట్‌ అంటూ అరవడం, అసందర్భంగా నవ్వుతుండటం, ఫోన్‌ రాకున్నా హాలో.. హాలో అంటూ మాట్లాడడం, ఎవరు చేశారని ఎవరైనా అడిగితే అశ్వత్థామ.. అనడం. ఒక్కోసారి ఉండండి.. డిపోలో కలెక్షన్‌ కట్టివస్తా అనడం వంటి పనులు చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేస్తుంది. అంతేకాదు తనను, పిల్లలను కూడా గుర్తు పట్టట్లేదని తెలిపింది. తమకు ఇద్దరు కొడుకులు ఉన్నారని, జీతం రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పింది. నాగేశ్వర్‌ రాత్రంతా నిద్రపోట్లేదని చెప్పింది.