టీ వ్యాలెట్‌కు అదనపు భద్రత: ఎక్కడైనా.. ఎలాగైనా వాడేలా రూపే కార్డు

టీ వ్యాలెట్‌కు అదనపు భద్రత: ఎక్కడైనా.. ఎలాగైనా వాడేలా రూపే కార్డు

telangana-RTA-m-Wallet

T-Wallet Ruapy Card: తెలంగాణ ప్రభుత్వం డెవలప్ చేసిన టీ వ్యాలెట్ మరో మైలురాయిని చేరుకోనుంది. ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో భద్రత పెంచేందుకు త్వరలో రూపే కార్డుతో అనుసంధానం చేయనున్నారు. వ్యాలెట్‌ బేస్‌డ్ ‘రూపే’ కార్డు అందుబాటులోకి వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ బ్యాంకు వివరాలు తెలిసే అవకాశం ఉండదని.. చెల్లింపులకు అడిషనల్ ప్రొటెక్షన్ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. టీ-వ్యాలెట్‌ను డెవలప్ చేసింది తెలంగాణ ప్రభుత్వమైతే.. రూపే కార్డును మాత్రం కేంద్రం రిలీజ్ చేసింది.

రూపే కార్డు జారీకి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) పర్మిషన్ ఇచ్చేసినట్లు వెల్లడించారు. ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నవారికి మాత్రమే కార్డును మంజూరుచేయనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి సాధారణ పేమెంట్స్‌ యాప్‌ మాదిరిగానే పనిచేస్తున్న టీ వ్యాలెట్.. బ్యాంకు అకౌంట్ లేదా డెబిట్‌ కార్డుల సహాయంతో వ్యాలెట్‌లో డబ్బు వేసుకోవచ్చు. ఏదైనా బిల్లు చెల్లించాల్సి వచ్చినప్పుడు యాప్‌తో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి పేమెంట్‌ చేయవచ్చు. ఇప్పుడు రానున్న రూపే కార్డు.. సహాయంతో చెల్లింపుల సమయంలో వ్యాలెట్‌లోని సొమ్మును యాప్‌తో స్కాన్‌ చేయొచ్చు. లేదంటే.. కార్డుతో స్వైప్‌ చేయవచ్చు. సాధారణ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల మాదిరిగానే టీ-రూపే కార్డుకు కూడా కార్డ్‌ నంబర్‌, సీవీవీ నంబర్‌, ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటాయి.

2 కోట్లు దాటేశారు:
డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో 2017 జూన్‌ 1న తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా వ్యాలెట్‌ను ప్రవేశపెట్టింది. యాప్‌, వెబ్‌సైట్‌తోపాటు ఫీచర్‌ ఫోన్‌లోనూ ఈ వ్యాలెట్‌ సేవలను వినియోగించుకోవచ్చు. స్మార్ట్‌ ఫోన్‌ లేనివారు సమీపంలోని మీసేవకు వెళ్లి టీవ్యాలెట్‌ అకౌంట్‌ తెరిచి, డబ్బు వేసుకోవాల్సి ఉంటుంది. UID ఆథంటిఫికేషన్‌ ఆధారంగా పేమెంట్స్‌ చేయవచ్చు. ప్రభుత్వ సేవలైన meeseva, ghmc, hmda, rda, electric, orr బిల్లులను చెల్లించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టీ-వ్యాలెట్‌కు 12 లక్షలకుపైగా వినియోగదారులు ఉన్నారు. ఇప్పటివరకు 2 కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయి.