ఐటీ కంపెనీలో సోదాలు : ఏపీ తెలంగాణ మధ్య రాజుకున్న వివాదం

  • Published By: chvmurthy ,Published On : March 3, 2019 / 04:02 AM IST
ఐటీ కంపెనీలో సోదాలు : ఏపీ తెలంగాణ మధ్య రాజుకున్న వివాదం

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదురుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టీడీపీకి ఐటీ సేవలందించే కంపెనీల్లో తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఐటీ ఉద్యోగులను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారిని తమకు అప్పగించాలని ఏపీ పోలీసులు డిమాండ్ చేయడంతో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది.
తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలు అందిస్తున్న బ్లూఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీతో పాటు, ఐటీ గ్రిడ్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై తెలంగాణ పోలీసులు శనివారం రాత్రి దాడులు చేశారు. ఏపీలోని లబ్ధిదారుల డాటా  మొత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీ కార్యాలయంలో ఉందన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ కార్యాలయాల్లో శనివారం అర్ధరాత్రి వరకు తనిఖీలు నిర్వహించారు.  

దీంతో శనివారం అర్ధరాత్రి మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీ వద్ద హై డ్రామా నెలకొంది. టీడీపీకి చెందిన సేవామిత్రలు, బూత్‌ కన్వీనర్లు, కార్యకర్తల సభ్యత్వ వివరాలు ఉన్న సర్వర్లను ఓపెన్‌ చేయాలని తెలంగాణ పోలీసులు ఆదేశించారు. నలుగురు  ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అప్పగించారు. ఐటీ గ్రిడ్‌లో పనిచేస్తున్న భాస్కర్ అనే వ్యక్తి కనిపించడం లేదని సదరు కంపెనీ యాజమాన్యం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. భాస్కర్ కోసం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ కార్యాలయానికి ఏపీ పోలీసులు వచ్చారు. డేటా చోరీ కేసులో భాస్కర్  తమ అదుపులో ఉన్నాడని ఏపీ పోలీసులకు తెలంగాణ పోలీసులు తెలిపారు. తమను లోపలికి అనుమతించాలని ఏపీ కోరగా అందుకు తెలంగాణ పోలీసులు నిరాకరించారు. దీంతో సర్వర్లను, ఉద్యోగులను తీసుకెళ్లడానికి వీలులేదని, భాస్కర్‌ను తమకు అప్పచెప్పాలని  తెలంగాణ పోలీసులను ఏపీ పోలీసులు కోరారు.

వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు టీడీపీకి సేవలందించే ఐటీ కంపెనీలపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తమ డేటాతో వైసీపీ నేతలకు పనేంటని ప్రశ్నించారు.  ఉద్యోగులను ఇబ్బందిపెడితే తీవ్ర  పరిణామాలు ఉంటాయని సీఎం గట్టిగా హెచ్చరించారు. ఐటీ గ్రిడ్‌ ద్వారా ప్రజల వ్యక్తిగత డేటా బహిర్గతమవుతోందని తమకు ఫిర్యాదు అందినట్లు సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. ఐపీసీ 120బి, 379,420, 188 ఐపీసీ, ఐటీ యాక్ట్‌లోని 72,66 ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ  కేసులో ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యం నిందితులుగా ఉన్నారని సజ్జనార్ తెలిపారు. ఐటీగ్రిడ్స్ కంపెనీలో సోదాలు కొనసాగుతాయన్నారు.