ఫణి తుపాన్ : తెలంగాణలో భగభగలు..ఏపీలో కూల్ వాతావరణం

  • Published By: madhu ,Published On : April 25, 2019 / 12:47 AM IST
 ఫణి తుపాన్ : తెలంగాణలో భగభగలు..ఏపీలో కూల్ వాతావరణం

తెలంగాణలో భానుడు మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్నాడు. నాలుగు రోజులుగా వర్షాలతో కాస్త వేసవి తాపం నుంచి ఉపశమనం పొందిన ప్రజలకు మళ్లీ ఉక్కపోత మొదలైంది. మరోవైపు ఏప్రిల్ 25వ తేదీ గురువారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది తుపానుగా మారనుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో మాత్రం కాస్త వాతావరణం చల్లబడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు తగ్గిపోయాయని, మూడు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టం చేసింది. గురువారం నుండి మండుటెండలు, వడగాలులు, ఉక్కపోత మరింత పెరుగుతాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 
ఇక బంగాళాఖాతం, హిందూమహాసముద్రం మధ్య ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం ఏర్పడే అల్పపీడనం తుపానుగా మారే అవకాశముందని చెన్నై వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

శ్రీలంకకు ఆగ్నేయంగా హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 36 గంటల్లో వాయుగుండంగా బలపడుతుందని తెలిపారు. ఇది వాయివ్యదిశగా తమిళనాడు వైపు ప్రయాణిస్తుందని వివరించారు. అనంతరం 48 గంటల వ్యవధిలో తుఫానుగా మారుతుందని తెలియజేశారు. ఈ సీజన్‌‌లో ఏర్పడుతోన్న తొలి తుఫాను కాగా, దీనికి ఫణి అని నామకరణం చేశారు. ఈ ఫణి తుపాను ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలపై తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని రెండు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావంతో ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. దీనికితోడు ద్రోణి బలపడి.. అల్పపీడనంగా మారే క్రమంలో.. ఏపీలో చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తెలంగాణలో వేడిగాలులు, ఏపీలో ఉరుములు, మెరుపులతో గాలులు, చల్లటి వాతావరణం ఉండనుంది.