దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ పై దర్యాప్తుకు సిట్‌ ఏర్పాటు : టీ.సర్కార్‌ కీలక నిర్ణయం

దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ జరుగుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేసేందుకు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను నియమించింది.

  • Published By: veegamteam ,Published On : December 9, 2019 / 02:31 AM IST
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ పై దర్యాప్తుకు సిట్‌ ఏర్పాటు : టీ.సర్కార్‌ కీలక నిర్ణయం

దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ జరుగుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేసేందుకు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను నియమించింది.

దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ జరుగుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేసేందుకు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను నియమించింది. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్ భగవత్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో సిట్‌ ఏర్పాటు చేసింది. ఇందులో వనపర్తి ఎస్పీ అపూర్వరావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, రాచకొండ ఎస్‌ఓటీ డీసీపీ సురేందర్, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్, రాచకొండ ఐటీ సెల్ శ్రీధర్‌రెడ్డి, కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు, సంగారెడ్డి డీసీఆర్‌బీ సీఐ వేణుగోపాల్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు.

చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ప్రతినిధుల బృందం దిశ కుటుంబ సభ్యులు, ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నిందితుల కుటుంబ సభ్యుల వాంగ్మూలం తీసుకోవడంతో పాటు వివరాలు సేకరించింది. తప్పు చేసిన మా బిడ్డలను శిక్షించమనే చెప్పాం. మా బిడ్డలను అన్యాయంగా కాల్చి చంపారంటూ ఎన్‌కౌంటర్‌ మృతుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు హత్యాచార ఘటన గురించి దిశ తండ్రితో పాటు సోదరిని ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు అడిగి తెలుసున్నారు. నిన్న హిమాయత్‌సాగర్‌లోని తెలంగాణ పోలీస్‌ అకాడమీలో వీరందరి నుంచి ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం స్టేట్‌మెంట్‌ రికార్డు చేసింది. 

సాయంత్రం 5.40 గంటల సమయంలో ప్రత్యేక వాహనంలో పోలీసులు దిశ తండ్రితో పాటు సోదరిని పోలీస్‌ అకాడమీకి తీసుకొచ్చారు. అంతకుముందు ఉదయం మూడు వాహనాల్లో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నిందితుల కుటుంబ సభ్యులను తీసుకొచ్చి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. దిశ హత్యాచారం ఘటన రోజు వివరాలను మాత్రమే ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం అడిగి తెలుసుకుందని ఆమె తండ్రి, సోదరి వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌పై ఎలాంటి ప్రశ్నలు అడగలేదని స్పష్టం చేశారు. 

కోర్టు తీర్పు రాకముందే మా బిడ్డలను అన్యాయంగా ఎన్‌కౌంటర్‌ చేశారు. మాకు న్యాయం చేయండంటూ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నలుగురి కుటుంబీకులు ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు గుట్టుచప్పుడు కాకుండా పోలీసు ప్రత్యేక బృందం మహ్మద్‌ పాషా తండ్రి ఆరిఫ్‌ హుస్సేన్, నవీన్‌ తల్లి లక్ష్మి, శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తండ్రి కుర్మన్నను ప్రత్యేక వాహనంలో బందోబస్తు మధ్య హైదరాబాద్‌లోని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సభ్యుల వద్దకు తీసుకెళ్లారు. తిరిగి రాత్రి 8 గంటలకు వారి ఇళ్ల వద్ద వదిలేశారు. అలాగే మృతదేహాలకు పంచనామా చేసిన నలుగురు తహశీల్దార్లను కూడా విచారించారు.

నిందితుల తల్లిదండ్రులతో ఒకరి తర్వాత ఒకరితో ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సభ్యులు రెండు గంటల పాటు మాట్లాడిన ట్లు తెలుస్తోంది. మీ పిల్లల ప్రవర్తన ఎలా ఉండేది.. ఎందుకిలా ప్రవర్తించారు.. ఇంటి నుంచి ఎప్పుడెళ్లారు.. సంఘటనలో పోలీసులు వారిని ఎప్పుడు తీసుకెళ్లారు.. ఆ తర్వాతేం జరిగింది.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మీ బిడ్డలపై మీరు ఏమనుకుంటున్నారని ఎన్‌హెచ్‌ఆర్సీ  సభ్యులు ప్రశ్నించినట్లు తెలిసింది. చెన్నకేశవులు భార్య గర్భిణిగా ఉందని, ఆమెకు న్యాయం చేయాలంటూ చెన్నకేశవులు తండ్రి కుర్మన్న వారిని వేడుకున్నట్లు తెలుస్తోంది. తమ పిల్లల మృతదేహాలను ఎప్పుడిస్తారంటూ ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులను తల్లిదండ్రులు అడిగినట్లు తెలుస్తోంది. సోమవారం హైకోర్టు తీర్పు ఉంది.. ఆ తర్వాత మేము మీకు సమాచారమిస్తాం. మీ పిల్లల మృతదేహాలు భద్రంగా ఉన్నాయి. ఎప్పుడిస్తామనేది సోమవారం తెలుస్తుందని సముదాయించినట్లు సమాచారం.  

మరో రెండ్రోజులు ఎన్‌హెచ్‌ఆర్సీ బృంద సభ్యులు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఇప్పటికే ఘటనపై నివేదిక ఇవ్వాలని సైబరాబాద్‌ పోలీసులను ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ఆదేశించిన నేపథ్యంలో వారు ఫోరెన్సిక్, రెవెన్యూ రిపోర్టులతో కలిపి ఓ నివేదికను తయారుచేస్తున్నారు. నవంబర్‌ 27 దిశ కిడ్నాప్, లైంగికదాడి, హత్య, దహనం నుంచి డిసెంబర్‌ 6న ఎన్‌కౌంటర్‌ వరకు జరిగిన అన్ని విషయాలపై పక్కాగా నివేదిక రూపొందిస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి ఎన్‌హెచ్‌ఆర్సీ బృందానికి నివేదిక ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిన్న ఉదయం ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ఎన్‌కౌంటర్‌లో గాయపడి గచ్చిబౌలిలోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను విచారించింది. నేడో, రేపో ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న మిగిలిన పోలీసులనూ విచారిస్తారని సమాచారం.

మరోవైపు దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై నిన్న ఉదయం చటాన్‌పల్లి వద్ద పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహించారు. ఘటనా స్థలాల్ని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సభ్యులు ఇప్పటికే పరిశీలించారు. మరోమారు ఈ బృందం ఘటనా స్థలానికి వచ్చి ఎన్‌కౌంటర్‌ గురించి అడిగితే చూపించడానికి పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహించారు. హంతకులు పోలీసులపై ఎలా తిరగబడ్డారు.. ఏవిధంగా రాళ్లు, కట్టెలతో దాడికి పాల్పడ్డారు. ఏవిధంగా పోలీసులు హంతకులపై కాల్పులు జరిగాయన్న వాటిపై సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహించారు. దీనిని శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పర్యవేక్షించారు. అయితే ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం మళ్లీ సంఘటనా స్థలానికి వస్తుందా.. లేదా అన్న విషయంపై స్పష్టత లేదు.