టీఆర్ఎస్‌లోకి వెళ్లి తప్పు చేశానా?, షాద్‌నగర్‌ మాజీ కాంగ్రెస్ నేత ఆవేదన

అసలే ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు దగ్గరగా ఉన్న నియోజకవర్గం. అంతేనా.. భాగ్యనగరానికి కూత వేటు దూరం.. ఇక్కడ రాజకీయాలు కూడా ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే

  • Published By: veegamteam ,Published On : March 12, 2020 / 02:19 PM IST
టీఆర్ఎస్‌లోకి వెళ్లి తప్పు చేశానా?, షాద్‌నగర్‌ మాజీ కాంగ్రెస్ నేత ఆవేదన

అసలే ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు దగ్గరగా ఉన్న నియోజకవర్గం. అంతేనా.. భాగ్యనగరానికి కూత వేటు దూరం.. ఇక్కడ రాజకీయాలు కూడా ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే

అసలే ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు దగ్గరగా ఉన్న నియోజకవర్గం. అంతేనా.. భాగ్యనగరానికి కూత వేటు దూరం.. ఇక్కడ రాజకీయాలు కూడా ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ పడ్డ ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. అక్కడే అసలు సమస్య మొదలైంది. ఓడిపోయి ఏదో ప్రయోజనం ఉంటుందని పార్టీ మారిన ఒక నాయకుడు… అసలు పార్టీ మారి తప్పు చేశానా అని అనుకుంటున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? ఆ నాయకులు ఎవరు?

నియోజకవర్గం టీఆర్ఎస్‌లో వర్గపోరు:
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో షాద్‌నగర్‌ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏ ఎన్నికలు జరిగినా కోట్ల రూపాయలు వెచ్చించి ఢీ అంటే ఢీ అనే వాతావరణం ఉంటుందిక్కడ. ఓ వైపు రియల్ ఎస్టేట్, మరోవైపు పారిశ్రామిక రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నియోజకవర్గం కావడంతో ప్రధాన పార్టీల దృష్టంతా ఇక్కడే ఉంటుంది. 2018 ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా అంజయ్య యాదవ్, కాంగ్రెస్ తరఫున ప్రతాప్‌ రెడ్డి పోటీ చేశారు. ఈ ఇద్దరు నేతల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. అంజయ్య యాదవ్ గెలుపొందారు. అక్కడ వరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడు నియోజకవర్గంలో వర్గపోరు మొదలైందట. 

కాంగ్రెస్‌ బలహీనపడడంతో పాటే టీఆర్ఎస్‌లో వర్గపోరు:
ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ టికెట్ కోసం అసమ్మతి వాదం బలంగా వినిపించిన నియోజకవర్గాల్లో షాద్‌నగర్ ఒకటి. అయితే అధిష్టానం మీద విశ్వాసంతో అసమ్మతి వాదులంతా ఏకతాటిపైకి వచ్చి టీఆర్ఎస్‌ను గెలిపించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎంఎల్ఏ ప్రతాప్‌రెడ్డి ఫలితాల తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలు ముగిసిన మూడు నెలల వ్యవధిలోనే ఈ తంతు ముగిసింది. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్‌ బలహీనపడగా.. టీఆర్ఎస్‌లో వర్గపోరు మొదలైందంటున్నారు. ఎన్నికల్లో పోటీ పడిన ఇద్దరూ అధికార పార్టీలోనే ఉండడంతో ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారిందని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. 

అధికార పార్టీలో ఉన్నా ఉపయోగం లేదంటూ ప్రతాప్‌రెడ్డి ఆవేదన:
ఏదో అనుకొని టీఆర్ఎస్‌లో చేరినా ప్రయోజనం కనిపించడం లేదని ప్రతాప్‌రెడ్డి బాధ పడుతున్నారట. అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని అనుచరుల దగ్గర ఫీలవుతున్నారట. పార్టీ మారినప్పటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, సహకార ఎన్నికల్లో కనీసం తన అనుచర వర్గానికి ఎక్కడా కూడా టికెట్లు ఇప్పించుకోలేకపోయారట. ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్లు.. ఇలా అందరూ ఎంఎల్ఏ అంజయ్య వర్గం వారే కావడంతో ప్రతాప్‌రెడ్డి కక్కలేక మింగలేక మౌనంగా ఉంటున్నారని అంటున్నారు. 

అనవసరంగా పార్టీ మారాననే బాధలో ప్రతాప్‌రెడ్డి?
ఇప్పుడిప్పుడే ఎలాంటి ఎన్నికలు లేవు. నామినేటెడ్‌ పదవులు కూడా వస్తాయన్న గ్యారెంటీ లేదు. ఈ నేపథ్యంలో అనవసరంగా పార్టీ మారానని లోలోపల తెగ బాధపడిపోతున్నారని అనుచరులు అంటున్నారు. తన అనుచర వర్గానికి ఏం సమాధానం చెప్పుకోవాలో అర్థం కాకపోవడంతో హైదరాబాద్‌ దాటి బయటకు రావడం లేదట. సొంత వ్యాపారాలపై దృష్టి పెట్టి పార్టీ కేడర్‌కు కూడా అందుబాటులో లేకుండా పోతున్నారని చెబుతున్నారు. నియోజకవర్గంలో జరిగే పార్టీ, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతాప్‌రెడ్డి కనిపించకపోవడంతో ఆయన వర్గం అయోమయంలో దిక్కులు చూస్తోంది. మరోవైపు అంజయ్య యాదవ్ మాత్రం నియోజకవర్గంలో తన పట్టును మరింత పెంచుకుంటున్నారు. 

ప్రతాప్‌రెడ్డి వర్గానికి చెక్‌ పెడుతూ ముందుకెళ్తున్న అంజయ్య:
రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని తన కేడర్‌ను మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు పోతున్నారని అంటున్నారు. ప్రతాప్‌రెడ్డి తనకు పోటీ కాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం అంజయ్య యాదవ్‌ పూర్తిగా నియోజకవర్గం మీద దృష్టి పెట్టారని చెబుతున్నారు. పార్టీ అధిష్టానానికి వీర విధేయుడిగా ఉంటూ, ప్రతాప్‌రెడ్డి వర్గానికి ఎక్కడికక్కడే చెక్ పెడుతూ ముందుకు వెళుతున్నారట. దీంతో ఆ ఇద్దరు నేతల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్న చర్చ జోరుగా సాగుతోంది.