వానా వానా వెళ్లప్పా!!  : పంటలకు భారీ నష్టం

  • Published By: madhu ,Published On : January 27, 2019 / 01:38 PM IST
వానా వానా వెళ్లప్పా!!  : పంటలకు భారీ నష్టం

హైదరాబాద్ : అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. జంట నగరాలతోపాటు ఉమ్మడి వరంగల్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌, మెదక్‌  జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో వరి, మొక్క జొన్న పంటలకు నష్టం వాటిల్లింది. మామిడిపూత దశలో ఉన్న తరుణంలో కురుస్తున్న వర్షాలకు  పంట దిగుబడి  తగ్గిపోవడంతోపాటు పండ్ల నాణ్యత తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. జంట నగరాలతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.  అకాల వర్షాలతో ఉమ్మడి వరంగల్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌, మెదక్‌  జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అటు గ్రేటర్‌ హైదరాబాద్‌లోనూ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 

జగిత్యాల జిల్లా : 
జగిత్యాల జిల్లా సారంగాపూర్, రాయికల్‌, జగిత్యాల రూరల్‌ మండలాల్లో అకాలవర్షాలకు మొక్కజొన్న పొంట నేలకొరింది. మామిడి తోటల్లో  పూత రాలిపోయింది. వరినారు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయ్యాయి. డ్రెయిన్లు పొంగిపొర్లి  మురుగునీరు రోడ్లపైకి చేరడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 

మహబూబ్ నగర్ : 
మహబూబ్‌నగర్‌ జిల్లా మరిపెడ ప్రాంతంలో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. రైతులు ఎండపెట్టుకున్న మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు తడిచిపోయాయి. నాగర్‌ కర్నూలు జిల్లా వనపర్తిలో అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. 

సూర్యాపేట : 
సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో  వర్షాలు కరిశాయి. దీంతో పంటలు దెబ్బతిన్నాయి. నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మిర్చిపంట దెబ్బతిన్నది. అకాల వర్షాలు పత్తికి పూర్తిగా చేటు తెచ్చాయి. వర్షాలకు పత్తి  రంగుమారిపోవడంతో నాణ్యత దెబ్బతింటోదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇది ధరలపై ప్రభావం చూపుతుందని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. 

జయశంకర్ భూపాలపల్లి : 
జయశకంర్‌ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సింగరేణి కేటీకే ఉపరితల బొగ్గు గనుల్లో భారీగా వర్షం నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలచిపోయింది. అకాల వర్షాలతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.