ఆర్టీసీపై ఎండ ప్రభావం

  • Published By: chvmurthy ,Published On : April 21, 2019 / 06:28 AM IST
ఆర్టీసీపై ఎండ ప్రభావం

హైదరాబాద్: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన… తెలంగాణ ఆర్టీసీపై భానుడు కూడా పంజా విసురుతున్నాడు. అసలే నష్టాల్లో ఉన్న సంస్థను మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నాడు. రోజురోజుకీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో డ్రైవర్లు విధులకు రావాలంటేనే వణికిపోతున్నారు. అదిరిపోతున్న ఎండల్లో డ్రైవింగ్ చేయడం మావల్ల కాదంటున్నారు. దీంతో నిత్యం వందలాది బస్సులు డిపోలకే పరిమితమవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆర్టీసీని భానుడు సైతం దెబ్బ కొడుతున్నాడు. ఎండలు ముదరడంతో రవాణా సంస్థలకు కొత్త సమస్య వచ్చి పడింది. ఓవైపు డ్రైవర్ల కొరతతో వందల బస్సులు డిపోలకే పరిమితమవుతుండగా ప్రస్తుతం ఎండవేడి భరించలేక డ్రైవర్లు డబుల్‌ డ్యూటీకి నిరాకరిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఏటా వేసవికాలంలో ఖమ్మం, కొత్తగూడెం, రామగుండం, మణుగూరు, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 45డిగ్రీలు దాటుతూ ఉంటాయి. సాధారణంగానే ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలోనే జనసంచారం అంతగా ఉండదు.

వేసవి కాలం ఆరంభం నుండే బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుతూ వస్తుంటుంది. ఏప్రిల్, మేలోనైతే అత్యవసరమైతే తప్ప జనం ప్రయాణాలకు ఇష్టపడరు. కానీ ఆర్టీసి మాత్రం సీజన్లతో సంబంధం లేకుండా ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సర్వీసులు నడిపిస్తుంది. సంస్థకు నష్టాలు వస్తున్నా బస్సులను మాత్రం నిలిపివేయదు. గత కొన్నేళ్లుగా ఎండ తీవ్రత పెరగడంతో వేసవిలో బస్సులు నడిపేందుకు డ్రైవర్లు ముందుకు రావడం లేదు. ఈ ఏడాది వేడి మరింత ఎక్కువ కావడంతో డ్రైవర్లు అందుబాటులో లేక బస్సులు డిపోలకే పరిమితం అవుతున్నాయి. అర్ధంతరంగా కొన్ని ట్రిప్పులను రద్దు చేయాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. వీటికితోడు ఆర్టీసీలో ఆరేళ్లుగా డ్రైవర్ల నియామకం లేకపోవడంతో పాటు పదవీ విరమణ చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. మరి కొంతమంది సిబ్బంది మృత్యువాత పడుతుండగా ఇంకొందరు అనారోగ్యంతో దీర్ఘకాలిక సెలవులు పెడుతున్నారు. ఈ కారణాలతో ప్రస్తుతం ఆర్టీసీలో రెండువేల మంది డ్రైవర్ల కొరత ఏర్పడింది. దీంతో ఎప్పటికప్పుడు డిపో అధికారులు అందుబాటులో ఉన్న డ్రైవర్లను బతిమిలాడి డబుల్‌ డ్యూటీలకు పంపుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు వెళ్తున్నప్పటికీ సుదూర ప్రాంతాలకు బస్సులు నడిపే వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు.

రాజధాని హైదారాబాద్‌లో పరిస్ధితి మరింత దారుణంగా మారింది. ఇక్కడ డ్రైవర్ల కొరత మరింత అధికంగా ఉంది. ప్రస్తుతం నగరంలో దాదాపు 700 డ్రైవర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనారోగ్యం, ఇతర సమస్యలతో కొందరు డ్యూటీలకు హాజరుకావడం లేదు. వెరసి వేయిమంది వరకు డ్రైవర్లు విధులకు రావటం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో నిత్యం 20 శాతం మేర సర్వీసులు డిపోలకే పరిమితమవుతున్నాయి. ఇటీవల అద్దె బస్సుల సంఖ్య బాగా పెంచటంతో సమస్య కొంత తగ్గినా అది ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా లేదు.

మరోవైపు ఎండకు భయపడి ఆర్టీసీ డ్రైవర్లు డ్యూటీలకు నిరాకరిస్తుంటే.. బస్సులు ఎక్కే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించడంతో నగరంలో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య బాగా తగ్గిందని అధికారులు చెప్తున్నారు.