యాసంగి పంటపై సూర్యుడి ప్రతాపం

10TV Telugu News

సూర్యుడి ప్రతాపం..యాసంగి పైర్లపై పడింది. ఎండలకు తట్టుకోలేక పైర్లు నేలవాలుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా తాడికల్, జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లలో 44 డిగ్రీలు టెంపరేచర్ రికార్డయ్యింది. ఈ ప్రాంతాల్లో ఉన్న పంటలు సాగు దశలో ఉణ్నాయి. సాగునీరు లేకపోవడంతో రైతులు ఒకవైపు సతమతమవుతుంటే పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మరింత ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల వడగండ్ల వానలు, పెనుగాలులతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం 21 ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి. 

గత జులై నుండి రాష్ట్రంలో వర్షాలు సరిగ్గా కురవలేదు. ఖరీఫ్, ప్రస్తుత యాసంగి సీజన్‌లో పంటలకు నీరందించడం రైతన్నలకు భారంగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా గత జూన్ నుండి ఇప్పటి వరకూ సాధారణం కన్నా 16 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. 16 జిల్లాల్లో వర్షపాతం లోటు 20 నుండి 45 వరకూ ఉంది. మొత్తం 21 జిల్లాల్లో భూగర్భ జల మట్టాలు తగ్గినట్లు భూగర్భ జల శాఖ వెల్లడించింది.