ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కూల్ కిట్లు 

  • Published By: vamsi ,Published On : April 18, 2019 / 03:52 AM IST
ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కూల్ కిట్లు 

ఎండనక, వాననక రోడ్డుపై నిలబడి కాలుష్య వాతావరణంలో పనిచేసే ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కూల్ కిట్లను పంపిణీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు మంచినీళ్ల బాటిల్, బటర్ మిల్క్ ప్యాకెట్, మాస్క్, గాగుల్స్, విఫెల్టెట్ జాకెట్, గ్లూకోన్-డీ, కూలర్ లైట్ తదితర వస్తువులతో కూడిన సమ్మర్ కిట్‌లను ఇస్తున్నారు.

హైదరాబాద్ నగరంలోని  2,400 మంది ట్రాఫిక్ సిబ్బందికి ఈ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులే హైదరాబాద్ సిటీ పోలీసులకు బ్రాండ్ అంబాసిడర్లు అని కమిషనర్ కొనియాడారు. నగరంలో 86 లక్షల మందికి తమ వంతు సహాయాన్ని ట్రాఫిక్ విభాగం అందిస్తుందని కమీషనర్ అన్నారు.

రోడ్డు ప్రమాదాలను నివారిస్తూ.. రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ట్రాఫిక్ విభాగంలో తీసుకొచ్చిన పలు సంస్కరణలు, సిబ్బంది కృషితో ఇది సాధ్యమైందని అన్నారు. ట్రాఫిక్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కూల్ కిట్లను అందించిన కమీషనర్.. రోడ్డు భద్రత ప్రమాణాలను మరింతగా మెరుగుపరుస్తామని చెప్పారు.