ప్రచండ భానుడు : మండుతున్న ఎండలు

భానుడు భగభగ మండుతున్నాడు. వేసవి ప్రారంభంలోనే తడాఖా చూపిస్తున్నాడు.

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 04:12 AM IST
ప్రచండ భానుడు : మండుతున్న ఎండలు

భానుడు భగభగ మండుతున్నాడు. వేసవి ప్రారంభంలోనే తడాఖా చూపిస్తున్నాడు.

హైదరాబాద్ : భానుడు భగభగ మండుతున్నాడు. వేసవి ప్రారంభంలోనే తడాఖా చూపిస్తున్నాడు. ఎండలతో జనాలను బెంబేలెత్తిస్తున్నాడు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు బయటికి రావాలంటనే జంకుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. హైరాబాద్‌లో 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు తోడు కాంక్రీట్‌ మహారణ్యం కారణంగా ఇప్పుడు అతినీల లోహిత కిరణాల తీవ్రత భారీగా పెరిగింది. అల్ట్రా వయొలెట్‌ రేడియేషన్‌ ఇండెక్స్‌ (యూవీ) సూచీ ‘పది’ పాయింట్లకు చేరింది. సాధారణంగా యూవీ సూచీ 9 పాయింట్లకు మించితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ మార్చిలోనే పది మార్కు దాటేసింది. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఇలాగే కొనసాగితే ఏప్రిల్, మేలో యూవీ సూచీ 12 పాయింట్లకు చేరే ప్రమాదముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గ్రేటర్‌ విస్తీర్ణంలో హరితం 8 శాతానికే పరిమితం కావడం, బహుళ అంతస్తుల కాంక్రీటు, గాజు మేడల కారణంగా సూర్యుడి నుంచి వెలువడిన ఉష్ణం భూ ఉపరితల వాతావరణానికే పరిమితం అవుతోంది. ఫలితంగా మార్చి నెలల్లో వికిరణ తీవ్రత పెరుగుతోంది.

యూవీ ఇండెక్స్‌ 
రోజులో ఏదైనా ప్రాంతంలో, సమయంలో మానవ చర్మం మంట పుట్టించే అతినీల లోహిత కిరణాల తీవ్రతను (వివిధ తరంగ ధైర్ఘ్యాల వద్ద) యూవీ ఇండెక్స్‌గా పరిగణిస్తారు. సూచీ తీవ్రత పెరిగిన కొద్దీ చర్మంపై యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు యూవీ ఇండెక్స్‌ 6 ఉన్నప్పుడు ఓ వ్యక్తి ఎండలో 30 నిమిషాల పాటు నిలబడితే అతడికి సన్‌బర్న్‌ (చర్మం మంటపుట్టడం) వచ్చే అవకాశం ఉంటుంది. అదే సూచీ 12 కనుక ఉంటే 15 నిమిషాల్లోనే ఆ వ్యక్తి చర్మం మంట పుట్టడం, కందిపోవడం, ఎర్రగా మారడం వంటి లక్షణాలు వస్తాయి. ఎండ తీవ్రతను కొలిచేందుకు ఈ సూచీని ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సూచీని 1994లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. ఈ సూచీ ఆధారంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సంస్థలు అవగాహన ఇస్తుంటాయి. 

సమస్యలు.. పరిష్కారాలు..జాగ్రత్తలు 
యూవీ ఇండెక్స్‌ పెరగడంతో ఓజోన్‌ పొర మందం తగ్గి ప్రచండ భానుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్నాయి. ఓజోన్‌ రక్షణ లేక మనుషులపై నేరుగా పడటంతో కళ్లు, చర్మ సంబంధ వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారు. అధిక సమయం ఎండలో తిరిగితే కళ్లు, చర్మం మంట పుట్టడం, రెటీనా దెబ్బతినడం జరుగుతాయి. యూవీ సూచీ సాధారణంగా 7 పాయింట్లకు పరిమితమైతే  ఇబ్బందులు ఉండవు. 10 పాయింట్లు నమోదైతేనే ప్రమాదం. 12 పాయింట్లు దాటితే చర్మ కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో సన్‌స్క్రీన్‌ లోషన్లు రాసుకోవాలని, చలువ కళ్లద్దాలు, క్యాప్‌ పెట్టుకోవాలని, గొడుగు వాడాలని సూచిస్తున్నారు. 

మెట్రోనగరాల్లో హరితం  
దేశంలో 35% గ్రీన్‌బెల్ట్‌తో చండీగఢ్‌ తొలిస్థానంలో ఉంది. రెండోస్థానంలో నిలిచిన దేశ రాజధాని ఢిల్లీలో 20.2%, గ్రీన్‌సిటీగా పేరొందిన బెంగళూరులో 19%, కోల్‌కతాలో 15%, ముంబైలో 10%, చెన్నైలో 9.5% గ్రీన్‌బెల్ట్‌ ఉన్నట్లు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్‌లో మాత్రం 8 శాతానికే పరిమితం కావడంపై పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

హైదరాబాద్‌ లో తగ్గుతున్న హరితం.. 
హైదరాబాద్‌ను గ్రీన్‌సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో తలపెట్టిన హరితహారం కార్యక్రమం ఉద్దేశం బాగానే ఉన్నా.. గ్రీన్‌బెల్ట్‌ను గణనీయంగా పెంచేందుకు దోహదపడలేదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరితహారంలో భాగంగా గతేడాది 95 శాతం ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూలమొక్కలను పంపిణీ చేశారని.. బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీస్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్‌ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు 5 శాతం మాత్రమే నాటినట్లు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో గ్రేటర్‌లో గ్రీన్‌బెల్ట్‌ 8 శాతానికే పరిమితమైందని చెబుతున్నారు. గ్రీన్‌బెల్ట్‌ విషయంలో దేశంలో పలు మెట్రో నగరాల్లో హైదరాబాద్ మహానగరం ఏడో స్థానంలో నిలిచిందని పేర్కొంటున్నారు. 

సూచనలు..
ప్రధాన రహదారులు, చెరువుల చుట్టూ పెద్ద మొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్‌ ఏర్పాటు చేయాలి. తద్వారా భూగర్భజలమట్టాలు పెరిగి, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్న వారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్‌ ఇచ్చిన తర్వాతే జీహెచ్‌ఎంసీ అనుమతులు ఇవ్వాలి. నూతన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్‌ ఉండాలి. లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.