వణికిస్తోంది : వరంగల్‌లో స్వైన్ ఫ్లూ విహారం

  • Published By: madhu ,Published On : January 30, 2019 / 01:15 AM IST
వణికిస్తోంది : వరంగల్‌లో స్వైన్ ఫ్లూ విహారం

హైదరాబాద్ : ఒక్కసారిగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలికి జనం వణికిపోతుంటే..ఇదే అదునుగా స్వైన్‌ ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్‌ ఫ్లూ విజృంభిస్తోంది. కేవలం జనవరి నెలలోనే 94 మందికి వ్యాధి నమూనా పాజిటివ్‌గా నమోదైంది..నల్సార్‌ యూనివర్సిటికి చెందిన నలుగురు విద్యార్ధినిలకు వ్యాధి సోకిందని నిర్ధారణ చేశారు. అంతేకాకుండా గాంధీ ఆస్పత్రిలో ఒకరు మృతి చెందగా వరంగల్‌ ఎంజీఎంలో మరొకరు మృతి చెందారు.

తెలంగాణ వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడంతో స్వైన్‌ ఫ్లూ విజృంభిస్తోంది. వ్యాధి బారిన పడి.. ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందగా.. మరో 94 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ ఫ్లూ వ్యాధికి చికిత్స పొందుతూ మహబూబ్‌ నగర్‌కు చెందిన మహిళ మృతి చెందింది. ఆసుపత్రిలో ఇప్పటికే 7 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 9 మంది స్వైన్ ఫ్లూ లక్షణాలతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరోవైపు వ్యాధి బారినపడ్డ నల్సార్ యూనివర్శిటీకి చెందిన నలుగురు విద్యార్ధుల పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోవటంతో  స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 

అటు ఉమ్మడి వరంగల్ జిల్లాను స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది. ఇప్పటికే నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వారిలో ఒకరు మృతి చెందారు. ఎంజీఎంలో దగ్గు, జలుబు, జ్వరంతో ఎంజీఎంలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో.. అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. అయితే.. వసతుల లేమి వ్యాధి విస్తరణకు కారణమవుతోందని అధికారులు చెబుతున్నారు. వ్యాధి నిర్దారణ కేంద్రం హైదరాబాద్‌లో ఉండటంతో.. రిపోర్టులు రావడం ఆలస్యమవుతోందని, అదే మృతుల సంఖ్య పెరగడానికి కారణమవుతుందంటున్నారు. ఎంజీఎం దవాఖానాకు అనుసంధానంగా వైరాలజీ ప్రయోగశాలను ఏర్పాటు చేస్తే ఉత్తర తెలంగాణ మొత్తానికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాధిని వెంటనే నిర్ధారించి, మెరుగైన చికిత్స అందించేందుకు వీలుంటుది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి, తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.