మరో నలుగురు అవసరం : త్వరలోనే TRSలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం! 

  • Published By: madhu ,Published On : March 28, 2019 / 02:14 AM IST
మరో నలుగురు అవసరం : త్వరలోనే TRSలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం! 

పార్లమెంట్ ఎన్నికలలోపే కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకొనేందుకు TRS పావులు కదుపుతోంది. దీనివల్ల లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ని దెబ్బతీయవచ్చని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. విపక్ష హోదాను కోల్పోయేలా చేయాలని గులాబీ నేతలు కంకణం కట్టుకున్నారనే చెప్పవచ్చు. ఇప్పటికే 10 మంది కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అన్నారు. మరో నలుగురిని సమీకరిస్తే టీఆర్ఎస్ లక్ష్యాన్ని చేధించినట్లే. 

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ 19 మంది గెలిచారు. మూడింట రెండొంతులు అంటే..14 మంది కలిస్తే అప్పుడు ఫిరాయింపుల చట్టం వర్తించదు. గతంలో టీడీపీ పార్టీ ఇలాగే టీఆర్ఎస్‌లో విలీనమైంది. పోలింగ్ కంటే ముందే మరో నలుగురు ఎమ్యెల్యేల మద్దతు సమీకరించి..వెంటనే విలీన ప్రక్రియను పూర్తి చేయించాలని గులాబీ అధిష్టానం యోచిస్తోంది. 

మార్చి 27వ తేదీన బుధవారం కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే జాజుల సురేందర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సురేందర్ వెల్లడించారు. సరైన నిర్ణయం తీసుకున్నారంటూ కేటీఆర్ ఆయన్ను అభినందించారు. ఆయన పార్టీలో చేరడానికి రెడీ అయిపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సురేందర్ పదో వారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుండి 9 మంది శాసనసభ్యులు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. 

1. రేగాకాంతరావు (పినపాక) 2.ఆత్రంసక్కు (ఆసిఫాబాద్) 3. చిరుమర్తి లింగయ్య (నకిరేకల్) 4.హరిప్రియ (ఇల్లెందు) 5. కందాల ఉపేందర్ రెడ్డి (పాలేరు) 6. సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం) 7. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (ఎల్బీనగర్) 8. వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం) 9. హర్షవర్దన్ రెడ్డి (కొల్లాపూర్)‌లు టీఆర్ఎస్‌లో చేరారు. 10. జాజుల సురేందర్
టీడీపీ నుండి 11. సండ్ర వెంకటవీరయ్య త్వరలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. మొత్తం 120 మంది సభ్యులున్న తెలంగాణ శాసనసభలో టీఆర్ఎస్ సంఖ్యాబలం 91 కాగా..తాజాగా మద్దతిస్తున్న 11 మందితో ఈ సంఖ్య 102కి చేరనుంది.