ఇంటర్ మంటలు : లక్ష్మణ్ నిరవధిక నిరహార దీక్ష

  • Edited By: madhu , April 29, 2019 / 03:04 AM IST
ఇంటర్ మంటలు : లక్ష్మణ్ నిరవధిక నిరహార దీక్ష

ఇంటర్ మంటలు ఇంకా ఆరలేదు. ఫలితాలు వెలువడి 10 రోజులైనా..ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అటు ఇంటర్ బోర్డ్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వం కూడా రీ వెరిఫికేషన్, రీ వాల్యూయేషన్ ఫ్రీగా చేయాలని ఆదేశించింది. ఓ వైపు సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే… విపక్షాలు మాత్రం ఆందోళనను ఉధృతం చేసేందుకే సమాయత్తమవుతున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నారు.

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాలకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఏప్రిల్ 29వ తేదీ సోమవారం ఇంటర్ బోర్డు ఎదుట ధర్నాకు అఖిలపక్షాలు ప్లాన్ చేశాయి. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై అఖిలపక్ష పార్టీలు ఇప్పటికే ఆందోళన బాట పట్టాయి. జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహించింది. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. అంతే కాకుండా విద్యార్థుల కుటుంబాలను కాంగ్రెస్, జనసేన, సీపీఐ సహా పలు పార్టీల నేతలు పరామర్శించారు. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు జరిగాయని త్రిసభ్య కమిటీ నిర్ధారించిన నేపథ్యంలో ఉదయం పదిన్నరకు ఇంటర్‌బోర్డ్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. 

అటు కాంగ్రెస్ ఛలో ఇంటర్‌బోర్డ్‌కు పిలుపునిస్తే.. బీజేపీ సైతం ఆందోళనకు సిద్ధమవుతోంది. ఇంటర్ ఫలితాల్లో తప్పులకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నారు. ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న వారిని ప్రభుత్వం రక్షిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గ్లోబరీనా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరో బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. విపక్షాలు ఇంటర్‌బోర్డు తీరుపై ఆందోళనలకు దిగుతుండటంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.