తెలంగాణ బడ్జెట్ 2019 – ఐదేళ్లలో అద్భుత ప్రగతి సాధించాం

  • Edited By: chvmurthy , September 9, 2019 / 06:20 AM IST
తెలంగాణ బడ్జెట్ 2019 – ఐదేళ్లలో అద్భుత ప్రగతి సాధించాం

గడిచిన ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందని సీఎం కేసీఆర్ బడ్జెట్ 2019 ప్రవేశ పెడతూ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో కేసీఆర్‌ సోమవారం ప్రవేశపెట్టారు. ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపయ్యిందని… తద్వారా రాష్ట్రంలో సుస్ధిర ఆర్ధిక వ్యవస్ధ సాధ్యమైందని వివరించారు.

బడ్జెట్ 2019:

* రూ. 1,46,492.3 కోట్లతో బడ్జెట్
* రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు
* మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు
* బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు
* ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు

రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో దేశంలో అగ్రగామిగా  తెలంగాణ రాష్ట్రం నిలిచిందని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో అమలు చేసిన వినూత్న పథకాలు దేశాన్ని ఆశ్చర్య పరిచాయని…. దేశం యావత్తు తెలంగాణ వైపు చూసేలా చేశాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడాది నెలకు రూ.6,247 కోట్లు ఖర్చు పెడితే ఐదేళ్ల తర్వాత రూ.11వేల 305 కోట్లు ఖర్చు పెట్టే స్ధాయికి తెలంగాణ ఎదిగిందని కేసీఆర్ వివరించారు.

ఐదేళ్లలో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి రెట్టింపు అయిందని, వివిధ ఆర్థిక సంస్థలిచ్చిన నిధులను మూలధన వ్యయంగా ఖర్చు చేశామని కేసీఆర్ చెప్పారు. సమైక్య రాష్ట్రంలో అభివృధ్ది పనుల కోసం ఏడాదికి రూ.5వేల 400 కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రం ఏర్పడ్డాక ఏడాదికి సగటున రూ.33,833 కోట్లు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు. నిధుల ఖర్చు విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో ఉందని సీఎం తెలిపారు. ఐదేళ్లలో పెట్టుబడి వ్యయం ఆరు రెట్లు పెరిగిందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా ధృడంగా మారిందని కేసీఆర్ వివరించారు.