ఉద్యోగాలు ఉంటాయా : ఆర్టీసీ భవిష్యత్ తేల్చేయనున్న సీఎం

తెలంగాణలో ఆర్టీసీ భవిష్యత్‌ను తేల్చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ(నవంబర్ 28,2019), రేపు(నవంబర్ 29,2019) జరిగే కేబినెట్ భేటీలో ఆర్టీసీ ప్రధాన అంశంగా చర్చ

  • Published By: veegamteam ,Published On : November 28, 2019 / 02:09 AM IST
ఉద్యోగాలు ఉంటాయా : ఆర్టీసీ భవిష్యత్ తేల్చేయనున్న సీఎం

తెలంగాణలో ఆర్టీసీ భవిష్యత్‌ను తేల్చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ(నవంబర్ 28,2019), రేపు(నవంబర్ 29,2019) జరిగే కేబినెట్ భేటీలో ఆర్టీసీ ప్రధాన అంశంగా చర్చ

తెలంగాణలో ఆర్టీసీ భవిష్యత్‌ను తేల్చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ(నవంబర్ 28,2019), రేపు(నవంబర్ 29,2019) జరిగే కేబినెట్ భేటీలో ఆర్టీసీ ప్రధాన అంశంగా చర్చ జరగనుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెను వదిలి విధుల్లో చేరుతామని ప్రకటించిన తర్వాత తొలిసారి మంత్రివర్గం సమావేశమవుతోంది. దీంతో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై… అటు కార్మిక వర్గాలతో పాటు, ఇటు ప్రజల్లోను ఉత్కంఠ నెలకొంది.

మధ్యాహ్నం 2గంటలకు కేబినెట్ భేటీ కానుంది. ఆర్టీసీ సమ్మె, ప్రైవేట్ రూట్ పర్మిట్లు, నూతన రెవెన్యూ చట్టంపై సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. మంత్రివర్గం సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మెపై లేబర్ కోర్టులో తేల్చుకుంటారా? కార్మికశాఖ కమిషనర్ స్థాయిలోనే సమస్య పరిష్కారమయ్యేలా చూస్తారా? కార్మికులను విధుల్లోకి తీసుకుంటారా? 5వేల 100 రూట్లకు ప్రైవేట్ పర్మిట్లు ఇస్తారా? అసలు సమస్య పరిష్కారానికి ఎలాంటి ముగింపు పలుకుతారు? అనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ నిర్ణయంపై కార్మికులతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

ఆర్టీసీ సమ్మె భవితవ్యమేంటో కేబినెట్ సమావేశంలో తేలనుంది. ఆర్టీసీకి శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రకటించిన సీఎం కేసీఆర్… విధుల్లో చేరేందుకు కార్మికులు ముందుకు వచ్చినా… ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దీంతో శాశ్వత పరిష్కారం పేరుతో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ సమావేశంలో ప్రైవేట్ రూట్లపై ప్రకటన, లేబర్ కోర్టుకు వెళ్లే అంశాలతో పాటు కార్మికులను విధుల్లోకి తీసుకునే షరతలుపై చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.

ఆర్టీసీ నష్టాలను భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీలో 50శాతం మేర ప్రైవేట్ భాగస్వామ్యంతో బస్సులు నడపాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పూర్తి కసరత్తు చేసిన ప్రభుత్వం… మొత్తం 5వేల 100 రూట్లను ప్రైవేట్ పరం చేయాలని సంకల్పించింది. అదే జరిగితే కార్మికుల సంఖ్యను పెద్ద ఎత్తున తగ్గించాల్సి ఉండటంతో… ఇవాళ, రేపు జరిగే కేబినెట్‌ భేటీలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోనుంది. సిబ్బంది తగ్గింపుపై ఇప్పటికే పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. 50 ఏళ్లు పైబడిన కార్మికులకు గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న ప్రచారం జోరందుకుంది.

ఆర్టీసీని ప్రైవేటుకు ధీటుగా అభివృద్ధి చేయడం కోసం అవసరమయ్యే నిధులు, కార్మికులకు సెటిల్ మెంట్ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ఆస్తులను విక్రయించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీ నష్టాలను తాము భరించలేనని స్పష్టం చేయడంతో ప్రభుత్వం మరింత దూకుడుగానే నిర్ణయాలు తీసుకోనుంది. అయితే.. ఆర్టీసీ విభజనపై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్న నేపథ్యంలో మంత్రి మండలిలో దీనిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన ఆర్టీసీ కార్మికులు బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు లేబర్ కోర్టులో ఉన్న కారణంగా ఎలాంటి నిబంధనలు లేకుండా చేరతామని చెప్పారు. అయితే కార్మికుల డిమాండ్లను సీఎం కేసీఆర్ పట్టించుకోలేదు. దీంతో తమకు ఉద్యోగాలు ఇస్తే చాలు అన్నట్టు కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సీఎం మాత్రం భవిష్యత్‌లోనూ కార్మికులు సమ్మెలకు వెళ్లకుండా చూడాలనే యోచనలో ఉన్నారు. అది సాధ్యం కావాలంటే ముందుగానే ఆర్టీసీ ఒప్పందాలపై సంతకాలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దీంతో క్యాబినెట్‌లో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.

ఆర్టీసీ ప్రధాన అజెండాగా మంత్రి మండలి భేటీ అవుతున్నా.. కొత్త రెవెన్యూ చట్టంపై కూడా కేబినెట్‌ భేటీలో చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఆర్టీసీపై మంత్రివర్గం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.