8 అంశాలపై మంత్రుల కమిటీలు..టి.క్యాబినెట్ నిర్ణయం

  • Published By: madhu ,Published On : October 2, 2019 / 01:10 AM IST
8 అంశాలపై మంత్రుల కమిటీలు..టి.క్యాబినెట్ నిర్ణయం

ప్రభుత్వ కార్యక్రమాలు మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగా టి. క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎనిమిది అంశాలపై మంత్రుల కమిటీలు నియమించింది. కార్యక్రమాలను పర్యవేక్షించి..మంత్రివర్గ ఉప సంఘాలు నియమించాలని డిసైడ్ అయ్యింది. అందులో భాగంగా అక్టోబర్ 01వ తేదీ మంగళవారం నాడు జరిగిన టి.క్యాబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకుంది. 
వైద్యం..ఆరోగ్యం : –
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ అధ్యక్షతన, మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి, తలసాని సభ్యులుగా వైద్యారోగ్య కమిటీ ఏర్పాటైంది. ప్రజలకు వైద్య సేవలు ఎలా అందుతున్నాయి. వివిధ సీజన్లలో వచ్చే అంటు వ్యాధులు..ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ప్రభుత్వం ఎలాంటి పాత్ర పోషించాలనే దానిపై కమిటీ  పర్యవేక్షించనుంది. 
పట్టణ పారిశుధ్య కమిటీ : – 
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస గౌడ్, తలసాని, సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా పట్టణ పారిశుధ్య కమిటీని ప్రభుత్వం నియమించింది. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అమలు చేసే కార్యాచరణను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. 
గ్రామీణ పారిశుధ్య కమిటీ : –
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్యక్షతన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ సభ్యులుగా ప్రభుత్వం గ్రామీణ పారిశుధ్య కమిటీని నియమించింది. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు, భవిష్యత్తులో గ్రామాల్లో పారిశుధ్య పనులను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అవసరమైన కార్యాచరణను అమలు చేసే విషయంలో ఈ కమిటీ అప్రమత్తంగా ఉంటుంది. 
వనరుల సమీకరణ కమిటీ : – 
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస గౌడ్ సభ్యులుగా వనరుల సమీకరణ కమిటీని ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర స్థాయిలో వనరులను సమీకరించుకోవడం, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడం తదితర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. 
వ్యవసాయ కమిటీ : – 
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి సభ్యులుగా వ్యవసాయ కమిటీ ఏర్పాటైంది. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం, కల్తీలను నిరోధించడం, వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను అమలు చేయడం, విత్తనాలను, ఎరువులను సేకరించడానికి ఒక సమగ్ర విధానం రూపొందించడం తదితర కార్యక్రమాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పడం తదితర కార్యక్రమాలను కూడా ఈ కమిటీ చూసుకుంటుంది. 
సంక్షేమ కమిటీ : –
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ సభ్యులుగా సంక్షేమ కమిటీని ప్రభుత్వం నియమించింది. వివిధ వర్గాల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. 
పచ్చదనం కమిటీ : – 
అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు కేటీఆర్‌, జగదీశ్ రెడ్డి, తలసాని,  ప్రశాంత్ రెడ్డి సభ్యులుగా పచ్చదనం కమిటీని ప్రభుత్వం నియమించింది. తెలంగాణలో పచ్చదనం పెంచడం, అడవులు కాపాడడం, కలప స్మగ్లింగును అరికట్టడం తదితర కార్యక్రమాలను ఈ కమిటి పర్యవేక్షిస్తుంది.
పౌల్ట్రీ కమిటీ : – 
పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అధ్యక్షతన మంత్రులు శ్రీనివాస గౌడ్, ఈటల రాజెందర్, నిరంజన్ రెడ్డి సభ్యులుగా పౌల్ట్రీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమను పటిష్ట పరచడానికి అవసరమైన పాలసీని తీసుకురావడంతో పాటు, పౌల్ట్రీ అభివృద్ధికి తీసుకునే చర్యలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. మంచి పౌల్ట్రీ పాలసీ ఉన్న రాష్ట్రాల్లో పర్యటించి ఈ కమిటీ అధ్యయనం కూడా చేస్తుంది.
Read More : ఆర్టీసీని కాపాడుకుందాం : సమ్మెలోకి వెళ్లొద్దన్న టి.క్యాబినెట్