జననేత : హ్యాపీ బర్త్ డే కేసీఆర్

  • Published By: madhu ,Published On : February 17, 2019 / 01:52 AM IST
జననేత : హ్యాపీ బర్త్ డే కేసీఆర్

టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఫిబ్రవరి 17వ తేదీ ఆదివారం 66వ వసంతంలోకి అడుగుపెట్టారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కేసీఆర్‌… తెలంగాణ అభివృద్ధిలో అదే పంథా కొనసాగిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తెలంగాణ ముగిసి అధ్యాయం అన్నోళ్ల నోళ్లుమూయించి…. వ్యూహాత్మక ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రెండోసారి అధికార పగ్గాలు దక్కించుకున్నారు. 66వ జన్మదినం జరుపుకుంటున్న కేసీఆర్‌ రాజకీయ ప్రస్థానంపై 10tv కథనం..

> 17 ఫిబ్రవరి 1954లో జన్మించిన కేసీఆర్‌
> మెదక్‌ జిల్లా చింతమకడలో జననం
> ఎన్‌ఎస్‌యూఐ నేతగా రాజకీయ అరంగేట్రం
> సిద్ధిపేట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి
> 1985లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తన 65ఏళ్ల జీవితంలో సగానికిపైగా జీవితాన్ని చట్టసభల్లో ప్రతినిథిగానే గడుపుతున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని చింతమడక గ్రామంలో ఫిబ్రవరి 17, 1954లో ఆయన జన్మించారు. ఎస్‌ఎస్‌యూఐ నేతగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత సిద్ధిపేట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి…1985లో తొలిసారి శాసనససభ్యుడిగా విజయం సాధించారు. కేసీఆర్‌ సిద్ధిపేట నియోజకవర్గాన్ని రాజకీయంగా కంచుకోటగా మార్చుకున్నారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. తాను నిర్వహించే శాఖలపై పూర్తి పట్టుసాధించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 

> టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి కేసీఆర్‌ రాజీనామా
> సిద్ధిపేట నుంచే మరో విజయం అందుకున్న కేసీఆర్‌
> కేసీఆర్‌ ఉద్యమానికి పలువురి మద్దతు
> ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆలోచనలతో ఉద్యమం
> 2001లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం

తెలంగాణ ఉద్యమం కోసం టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. సిద్ధిపేట నుంచి తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ రగిలించడం తన రాజీనామాతోనే కేసీఆర్‌ మొదలుపెట్టారు. భారీ మెజార్టీతో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గొంతు ఎత్తుకున్న ప్రజాసంఘాలు, ఉద్యమ సంఘాలన్నీ కేసీఆర్‌ ఉద్యమానికి మద్దతు తెలిపాయి. ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆలోచనలతో కేసీఆర్‌ ఉద్యమ భావజాల వ్యాప్తిపై మరింత దృష్టి పెట్టారు. 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. 

2001 నుంచి  అధికార ప‌గ్గాలు చేప‌ట్టేవ‌ర‌కు ఎన్నో  ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంది. అయినా ఆ ఇబ్బందులు కేసిఆర్ ఉద్య‌మ ల‌క్ష్యం ముందు అవేవి ప‌నిచేయ‌లేదు. తెలంగాణా రాష్ట్ర సాధ‌నే త‌న ఏకైక ల‌క్ష్యం అనే నినాదంతోనే అడుగులు వేశారు.  కేసీఆర్‌ ఉద్యమ సమయంలో అనేక అవమానాలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. వైఎస్‌ అధికారంలోకి వచ్చాక అంటే 2009లో తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరిగాయి. పార్టీ నేతలు కూడా కొంతమంది దూరమయ్యారు. తెలంగాణ ఉద్యమంతోపాటు టీఆర్‌ఎస్‌ కూడా విచ్చిన్నం అయ్యే పరిస్థితి ఏర్పడింది. అయినా కేసీఆర్‌ మాత్రం ఏమాత్రం బెదరలేదు. అదరలేదు. సవాళ్లను ఎదుర్కొంటూ ఎప్పటికప్పుడు వ్యూహాలను రచిస్తూ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. 

సిద్దిపేటలో ఉద్యోగ గర్జనతో పేరుతో మొదలైన మలివిడత ఉద్యమం.. మూడేళ్లపాటు ఎన్నో కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచింది.  610 జీవో అమలు కోసం కేసీఆర్‌ ఏకంగా నిరాహార దీక్షకు పూనుకున్నారు. ప్రభుత్వం కేసీఆర్‌ను అరెస్ట్‌ చేసి ఖమ్మం ఆసుపత్రికి తరలించింది. ఇదే సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. విశ్వవిద్యాలయాలు ఉద్యమ కేంద్రాలుగా మారాయి.  చివరికి కేసీఆర్‌ దీక్షతో  కేంద్రం దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది. డిసెంబర్‌ 9న తెలంగాణ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని నాటి యూపీఏ ప్రభుత్వం ప్రకటన చేసింది.

> ఆంధ్రా నేతల వత్తిళ్లతో వెనక్కి తగ్గిన కేంద్రం
> టీజేఏసీని ఏర్పాటు చేసిన కేసీఆర్‌
> జేఏసీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు
> 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
> టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెట్టిన ప్రజలు

కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు ప్రకటన చేసినా… ఆంధ్రా నేతల వత్తిళ్లతో ఆతర్వాత వెనక్కి తగ్గింది. దీంతో కేసీఆర్‌ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అనేక  వ్యూహాలు రచించారు. తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలను కలుపుకుపోతూ… ఐక్య కార్యక్రమాలు నిర్వహించారు. సాగరహారం, సడక్‌బంద్‌, సకలజనుల సమ్మెలాంటి కార్యక్రమాలను నిర్వహించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలియజేశారు. ఏదైతేనే మొత్తానికి 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు.

నాలుగున్నరేళ్లలో తిరుగులేని రాజకీయ నేతగా ఆవిర్భవించారు. ఒకవైపు పార్టీని.. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేశారు. ప్రభుత్వ పరంగా తీసుకున్న అనేక సంక్షేమ పథకాలు టీఆర్‌ఎస్‌ను ప్రజలకు చేరువచేశాయి. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే  ఆదర్శంగా నిలిచాయి. కల్యాణ లక్ష్మీ, రైతుబంధు, ఉచిత విద్యుత్‌, ఆసరా పెన్షన్లు, టీహబ్‌, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ ఇలా చెప్పుకుంటూపోతే ప్రతీ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శమయ్యాయి. 

తెలంగాణ పాలనలో తనదైన మార్క్‌ వేసుకున్న కేసీఆర్‌.. తన నాలుగున్నరేళ్ల పాలనపై పూర్తి విశ్వాసంతో ముందస్తు ఎన్నికలకు మొగ్గుచూపారు. సెప్టెంబర్‌ ఆరున తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేరోజు పార్టీ అభ్యర్థులను ప్రకటించి సంచలన రాజకీయాలకు కేంద్రబిందువుగా మారారు.  డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాలకుగాను.. 88 చోట్లా గెలిచి రెండోసారి అధికారపగ్గాలు చేజిక్కించుకున్నారు. 

ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కాంగ్రెస్‌, బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు గులాబీ దళపతి పావులు కదుపుతున్నారు. జాతీయ స్థాయిలో కూడా రైతు సమస్యలే ప్రధాన ఎజెండా అంటూ కేసీఆర్‌ ప్రకటనలు చేస్తున్నారు. ఫ్రంట్‌ను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల అధినేతలతో చర్చలు జరిపారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో తన మార్క్‌ వేసుకునేందుకు గులాబీ దళపతి రెడీ అవుతున్నారు.