2.25 లక్షల కోట్లు : 1.25 కోట్ల ఎకరాలు

  • Published By: madhu ,Published On : January 19, 2019 / 02:39 AM IST
2.25 లక్షల కోట్లు : 1.25 కోట్ల ఎకరాలు

హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చెయ్యాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైతులకు సాగునీరు అందించడానికన్నా మించిన ప్రాధాన్యత మరొకటి లేదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరతలేదని, వెంటనే బిల్లులు  చెల్లించనున్నట్టు తెలిపారు. ప్రగతి భవన్‌లో  నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌.. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల కోసం ఇప్పటి వరకు 77వేల 777 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు.
2 లక్షల 25వేల కోట్లు…
తెలంగాణ రాష్ట్రంలో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా… 2 లక్షల 25వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరత లేదని.. వెంటనే పనులు వేగంగా జరిగేలా చూడాలని కోరారు. తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మించడంతోపాటు, పెద్దవాగు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి సమగ్రవ్యూహం రూపొందించుకుని నిర్మాణాలు ప్రారంభించాలన్నారు.
కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు…
భూసేకరణ, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం, ఆర్‌ఆర్‌ ప్యాకేజీల కోసం మరో  22వేల కోట్లు ఖర్చుచేశామన్నారు. మొత్తంగా ఇప్పటి వరకు 99వేల, 643 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నారు. ఏడాది మార్చి నాటికి మరో 7వేల కోట్లకుపైగా ఖర్చవుతుందని తెలిపారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం వరకు లక్షా 7వేల కోట్లకుపైగా వ్యయం అవుతుందన్నారు. రాబోయే ఐదేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి, మొత్తంగా కోటి 25లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వం లక్ష్యమని చెప్పుకొచ్చారు.