నెక్ట్స్ ఎవరు : కాంగ్రెస్ పెద్దలకు నిద్రలేని రాత్రులు

వరుస వలసలతో కాంగ్రెస్ విలవిలలాడుతోంది. ఆపరేషన్ ఆకర్ష్‌తో కకావికలమవుతోంది. ఒకరి తర్వాత ఒకరుగా హ్యాండిచ్చేస్తున్న నేతలు..

  • Published By: veegamteam ,Published On : March 20, 2019 / 01:59 PM IST
నెక్ట్స్ ఎవరు : కాంగ్రెస్ పెద్దలకు నిద్రలేని రాత్రులు

వరుస వలసలతో కాంగ్రెస్ విలవిలలాడుతోంది. ఆపరేషన్ ఆకర్ష్‌తో కకావికలమవుతోంది. ఒకరి తర్వాత ఒకరుగా హ్యాండిచ్చేస్తున్న నేతలు..

హైదరాబాద్: వరుస వలసలతో కాంగ్రెస్ విలవిలలాడుతోంది. ఆపరేషన్ ఆకర్ష్‌తో కకావికలమవుతోంది. ఒకరి తర్వాత ఒకరుగా హ్యాండిచ్చేస్తున్న నేతలు.. కారెక్కేస్తుంటే.. చేసేదేం లేక చేతులెత్తేస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే..  పోయేవారెంత మంది అని కాకుండా… ఉన్నోళ్లెందరు అని వేళ్ల మీద లెక్కించుకోవాల్సి ఉంటుందనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి కోలుకోకముందే… నేతల ఫిరాయింపులు హస్తం పార్టీని నిండా ముంచుతున్నాయి. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని  పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. రోజుకో నేత పార్టీని వీడి టీఆర్ఎస్‌లోకి క్యూ కడుతున్నారు. ఉదయాన్నే లేవగానే ఈ రోజు ఎవరు వెళ్లిపోతారా అని ఆలోచించాల్సిన పరిస్థితి. డీకే అరుణ బీజేపీలో చేరిన కొన్ని గంటల్లోనే మరో  ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు.
Read Also : కేసీఆర్.. దమ్ముందా : మేం పాండవులం గెలుపు కాంగ్రెస్ దే

కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సమావేశమైన హర్షవర్ధన్‌రెడ్డి…పార్టీలో  చేరే అంశంపై చర్చించారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు హర్షవర్ధన్‌రెడ్డి వెల్లడించారు.

అవసరమైతే… కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని హర్షవర్ధన్ ప్రకటించారు. సీఎం కేసీఆర్‌పై ఉన్న విశ్వాసంతోనే నియోజకవర్గ అభివృద్ధి కోసం  టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ 13 స్థానాల్లో టీఆర్ఎస్ గెల్చింది. కొల్లాపూర్ నుంచి మాత్రమే హస్తం పార్టీ గెలిచింది. జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే  కూడా గులాబీ గూటికి చేరిపోయారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ ఖాళీ అయిపోయింది.

లోక్‌సభ ఎన్నికలకు ముందు కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్‌ అధిష్టానం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే గులాబీ ఆకర్ష్‌తో డీలాపడ్డ హస్తం పార్టీ.. బీజేపీ ఆకర్ష్‌తో దిక్కుతోచని స్థితికి చేరుకుంది. డీకే అరుణ  నిష్క్రమణతో కాంగ్రెస్‌ నేతలు షాక్‌కు గురయ్యారు. తాజా పరిణామాలతో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. ఎప్పుడు ఏ నేత పార్టీ వీడతారో…తెలియక సతమతమవుతోంది. ఓవైపు కారు,  మరోవైపు కమలం తమ పార్టీ నేతలను లాక్కుంటుంటే హస్తం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఇదంతా చూస్తుంటే… కాంగ్రెస్ నుంచి వెళ్లే వాళ్ల జాబితా కాకుండా…ఆ పార్టీలో ఉండేవాళ్లు ఎంతమందో  లెక్కతీస్తే సరిపోతుందనే సెటైర్లు వినిపిస్తున్నాయి.
Read Also :కాంగ్రెస్ కు మరో షాక్ : కారెక్కుతున్న కొల్హాపూర్ ఎమ్మెల్యే