అంతమంది పేరున్న సీనియర్లు ఉన్నా, తెలంగాణ కాంగ్రెస్ దీనస్థితికి కారణం ఏంటి

మాటలు చెప్పడంలో ముందుంటారు. ఎవరికి వారే బాసుల్లా బిల్డప్పులిస్తారు. అందరూ సీనియర్‌ నాయకులే. ఎవరికి ఎవరూ తక్కువ కాదనే ఫీలింగ్‌. పార్టీ కోసం కలసి పని చేద్దామనే

  • Published By: veegamteam ,Published On : March 19, 2020 / 08:03 AM IST
అంతమంది పేరున్న సీనియర్లు ఉన్నా, తెలంగాణ కాంగ్రెస్ దీనస్థితికి కారణం ఏంటి

మాటలు చెప్పడంలో ముందుంటారు. ఎవరికి వారే బాసుల్లా బిల్డప్పులిస్తారు. అందరూ సీనియర్‌ నాయకులే. ఎవరికి ఎవరూ తక్కువ కాదనే ఫీలింగ్‌. పార్టీ కోసం కలసి పని చేద్దామనే

మాటలు చెప్పడంలో ముందుంటారు. ఎవరికి వారే బాసుల్లా బిల్డప్పులిస్తారు. అందరూ సీనియర్‌ నాయకులే. ఎవరికి ఎవరూ తక్కువ కాదనే ఫీలింగ్‌. పార్టీ కోసం కలసి పని చేద్దామనే ఆలోచనే వారి మైండ్‌లోకి రాదు. అందుకే ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతోంది. లెక్కకు పెద్ద నాయకులెందరు ఉన్నా.. సమన్వయంగా నడిపించేందుకు మాత్రం ఎవరూ ముందుకు రారు. అసలు టీ-కాంగ్రెస్‌ దీన స్థితికి ప్రధాన కారణమేంటి?

కాంగ్రెస్‌ పార్టీలో నాయకుల మధ్య కొరవడుతున్న సఖ్యత:
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అస్తవ్యస్తంగా మారిపోతోంది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని నాయకులు ఏకతాటిపైకి తీసుకువచ్చి బలోపేతం చేస్తేనే పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటిది పార్టీలో ఉన్న నాయకులకు ఎక్కడ కూడా పొసగడం లేదు. ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. హస్తం పార్టీలో రోజు రోజుకు వర్గ విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. దీంతో కార్యకర్తలు మధన పడుతున్నారు. టీ-పీసీసీ అధ్యక్షుడు సొంత జిల్లా నుంచి సీఎల్పీ నేత సొంత జిల్లా వరకు వర్గ విభేదాలు కాంగ్రెస్ పార్టీలో భగ్గుమంటున్నాయి. మొత్తానికి పార్టీ కలహాల కాంగ్రెస్‌గా మారింది.

స్థానిక ఎన్నికల నుంచి కోదండరెడ్డి, మల్‌రెడ్డికి మధ్య వివాదాలు:
హైదరాబాద్ జిల్లా విషయానికి వస్తే నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ మిగతా నాయకులను కలుపుకొని పని చేయడం లేదని ఆరోపణలున్నాయి. పార్టీలో ఉత్సాహంగా పని చేసే వారిని కాదని, తన అనుచరులకు పదవులు కట్టబెడతారని నగర కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి వీరి మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా పెరిగిపోయింది. ఎవరి వర్గానికి వారే టికెట్లు వచ్చేలా ప్రయత్నాలు చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఎంపీ రేవంత్‌రెడ్డికి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి అసలు పొసగడం లేదు. 
 

Also Read | విదేశాల నుంచి వచ్చిన వారు ఇంట్లో నుంచి బయటికి వస్తే చర్యలు – ఏపీ సర్కార్

రేవంత్‌రెడ్డి పట్నం గోసలో పాల్గొనని కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి:
రేవంత్‌రెడ్డి పట్నం గోస కార్యక్రమం చేపట్టిన ఆ కార్యక్రమంలో కేఎల్ఆర్ పాల్గొనలేదు. దీంతో వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాజీ సీపీపీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు ఏ మాత్రం సఖ్యత కనిపించడం లేదు. చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్ష చేసినప్పటికీ ఆ దీక్షలో పొన్నాల లక్ష్మయ్య పాల్గొనలేదు. ఆదిలాబాద్‌ జిల్లా కూడా అదే పరిస్థితి నెలకొంది. మాజీ డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు వర్గాలకు ఉప్పు నిప్పులాగ ఉంది. మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలిగా ప్రేమ్ సాగర్ సతీమణికి కేటాయించినప్పటి నుంచి ఇంకా వీరి మధ్య దూరం చాలా పెరిగింది. 

మధు యాష్కి వాహనంపై కొమిరెడ్డి అనుచరుల దాడి:
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు, మాజీ ఎంపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఎవరి వర్గాలను వారే ప్రోత్సహించుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్‌లో వర్గపోరు వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా మధనపడుతున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇదే పరిస్థితి కనపడుతోంది. మాజీ ఎంపీ మధు యాష్కిగౌడ్‌కి కాంగ్రెస్ నేత కొమిరెడ్డి రాములుకు అసలు పొసగడం లేదు. సార్వత్రిక ఎన్నికల ముందు కొమిరెడ్డి రాములు అనుచరులు మధు యాష్కి గౌడ్ వాహనంపై దాడి చేశారు.

భట్టి అనుచరులకే పదవులంటూ రేణుక ఆరోపణ:
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్కకి మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరికి మధ్య వివాదం తారస్థాయికి చేరింది. వీరి మధ్య సమన్వయం కుదర్చడానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి కుంతియా చేసిన ప్రయత్నాలు ఫలించలేదంట. తనకు తెలియకుండానే ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క తన అనుచరులకు పదవులు ఇస్తున్నారని రేణుకా చౌదరి ఫైర్ అవుతున్నారట. ఖమ్మం జిల్లాలో వీరిద్దరు కలిసి ఒకే వేదికను పంచుకున్న దాఖలాలు లేవు. 

నల్లగొండ జిల్లాలో నేతల మధ్య సమన్వయ లోపం:
కాంగ్రెస్‌కు కంచుకోటగా చెప్పుకున్న నల్లగొండ జిల్లాలో అగ్ర నాయకులు చాలా మందే ఉన్నారు. స్వయంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా. కానీ ఈ జిల్లాలో ఏ ఇద్దరి నేతల మధ్య సమన్వయం లేదు. ఎవరికి వారే యమునా తీరుగా వ్యవహరిస్తున్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, జానారెడ్డి, రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డి జిల్లాలో ఉన్నప్పటికీ ఏ ఒక్కరి మధ్య సమన్వయం లేదంటున్నారు. ఎవరి వర్గాలు వారివే. ఎవరి బలప్రదర్శనలు వారే చేసుకుంటారు. మెదక్ జిల్లాలోనూ అదే పరిస్థితి. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి గీతారెడ్డి, విజయశాంతి ఈ జిల్లా నుంచే ఉన్న ఎవరూ కలసి కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు. 

పదవులు అనుభవించిన వరంగల్‌ నేతలంతా సైలెంట్‌:
వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసే నాయకుడే కరువయ్యారు. పార్టీకి చెప్పుకోదగ్గ నేత కూడా లేకుండాపోయారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన వారంతా ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తన సొంత నియోజకవర్గమైన జనగామకు వెళ్లిన సందర్భాలు కూడా చాలా తక్కువే. పాలమూరు జిల్లాలో వర్గ విభేదాలు కారణంగానే డీకే అరుణ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళ్లారు. ఆ జిల్లా నుంచి ఏఐసీసీ సెక్రటరీలుగా ఉన్న చిన్నారెడ్డి, చల్లా వంశీచంద్ రెడ్డి, సంపత్ మధ్య కూడా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయంటున్నారు. బలమైన అధికార పార్టీపైన పోరాటం చేయాలంటే ముందు పార్టీని బలోపేతం చేసుకోవాలి. నాయకులంతా సఖ్యతగా ఉండాలని కార్యకర్తలు అంటున్నారు. కానీ, ఆ దిశగా ప్రయత్నాలే జరగడం లేదంటున్నారు.