జలజగడం : కృష్ణా రివర్ బోర్డుపై టి.సర్కార్ గుస్సా

  • Published By: madhu ,Published On : March 6, 2019 / 02:18 PM IST
జలజగడం : కృష్ణా రివర్ బోర్డుపై టి.సర్కార్ గుస్సా

ర‌బీలో సాగు నీటికి డిమాండ్ పెర‌గ‌క‌ముందే కృష్ణా వాటర్ కోసం కొట్లాట‌లు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి తగాదాలు పరిష్కరించాల్సిన కృష్ణా రివర్ మేనేజ్‍‌మెంట్ బోర్డ్.. ఏపీ – తెలంగాణ మధ్య గొడవకు కారణమవుతోంది. సంబంధంలేని విషయాల్లో తలదూరుస్తుండటంతో.. బోర్డ్ తీరుపై తెలంగాణ అసహనం వ్యక్తం చేస్తోంది. శ్రీశైలం.. నాగార్జున సాగర్ జలశయాల్లో దిగువ నీటి వాటాల విడుదలపై కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో ఎండీడీఎల్ ఎగువన తెలంగాణకు 28 టీఎంసీల వరకు నీటివాటా వాడుకొనే హ‌క్కుంది. అయినా కూడా… దిగువ నీటిపై ఇండెంట్లు ఇవ్వాలంటూ కృష్ణా బోర్డ్ రెండు రాష్ట్రాలకూ లేఖ రాసింది. కేటాయించిన వాటాకంటే ఒక టీఎంసీ ఎక్కువే ఏపీ వాడుకుందని బోర్డు లెక్క చెప్పింది. 

612.287 టీఎంసీలలో ఒప్పందం ప్రకారం ఏపీకి 404.110 టీఎంసీలు, తెలంగాణకు 208.178 టీఎంసీల వాటా వచ్చింది. ఇప్పటి వరకు కృష్ణా బేసిన్‌లో 576.421 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలు వాడుకున్నాయి. ఇంకా 35.866 టీఎంసీల వాటర్ అందుబాటులో ఉంది. 2018, డిసెంబర్‌లోనే 2019 మే వరకు తమ నీటి అవసరాలు ఎంత ఉంటాయనే విషయంపై రెండు రాష్ర్టాలు ఇండెంట్లు ఇచ్చాయి. మళ్లీ మే వరకు ఇండెంట్లు సమర్పించాలంటూ బోర్డు రెండు రాష్ట్రాలకు లేఖ రాయడం వివాదాస్పదమవుతోంది. 

శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ కంటే కంటే ఐదు అడుగుల ఎగువన నీళ్లున్నాయి. నాగార్జునసాగర్‌లో క‌నీస మ‌ట్టాల‌కు ఎగువన 31.641 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఇందులో తెలంగాణకు.. 27.596 టీఎంసీలతో పాటు… బోర్డు రిజర్వులో ఉంచిన 13 టీఎంసీలు.. మొత్తం 40.50 టీఎంసీల నీటి వాటా వస్తుంది. సాగర్ జలాశయంలో 520 అడుగుల నీటిమట్టం ఉంటేనే తెలంగాణ సాగర్ ఎడమకాల్వ ద్వారా తన వాటాను వాడుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ బోర్డు ఇప్పుడు హడావుడిగా వాటాలు వేసి ఏపీకి నీటిని కేటాయిస్తే.. ఎండీడీఎల్ ఎగువన ఉన్న నీటని కుడి కాల్వ ద్వారా ఏపీ మళ్లించుకుంటుంది. అప్పుడు తెలంగాణ ఎడమకాల్వకు నీటి విడుదల చేసుకోవడం వీలుపడడదు. 

మరోవైపు హైదరాబాద్‌కు తాగునీరు ఇవ్వాలంటే సాగర్‌లో కనీసం 510 అడుగుల నీటిమట్టం ఉండాలి. బోర్డు ఇప్పుడు వాటాలు వేసి.. ఉన్న నీటిని ఏపీ మళ్లించుకుపోతే హైదరాబాద్ తాగునీటి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ సాంకేతిక అంశాలను పరిగణనలోనికి తీసుకోకుండా, శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేయకుండా.. కేవలం కాగితాలపై నీటి వాటాలు వేసి బోర్డు కొత్త కొట్లాట‌ల‌కు బీజం వేయ‌డాన్ని తెలంగాణ ఆక్షేపిస్తోంది.