కష్టాలు తీరినట్టే : అన్ని ప్రయాణాలకు ఒకే కార్డు

  • Published By: veegamteam ,Published On : March 28, 2019 / 02:50 AM IST
కష్టాలు తీరినట్టే : అన్ని ప్రయాణాలకు ఒకే కార్డు

హైదరాబాద్: మెట్రో ఎక్కాలంటే టికెట్.. రైలు ఎక్కాలంటే మరో టికెట్.. ఆర్టీసీ, ఎంఎంటీఎస్, ఆటోలు, క్యాబ్ లు.. ఇలా దేనిలో ప్రయాణించాలన్నా వేర్వేరుగా డబ్బు చెల్లించాల్సిందే. హైదరాబాద్ నగరంలో నిత్యం ఎంతోమంది ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి త్వరలోనే ఊరటనిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వాటి మధ్య సమన్వయం తీసుకొచ్చే పనిలో పడింది. అన్ని ప్రయాణాలకు ఒకే కార్డు తీసుకొచ్చే ఆలోచనలో ఉంది.

మెట్రో రైలు, ఆర్టీసీ, ఎంఎంటీఎస్, ఆటోలు, క్యాబ్‌ల ద్వారా రవాణా చేసే ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ప్రయాణాలకు కామన్‌గా ఒకే మొబిలిటీ కార్డు అందించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి  తెలిపారు. వాటన్నింటిని ఒక్కతాటిపైకి తెచ్చి అన్ని రకాల ప్రజారవాణ సంస్థల్లో పనిచేసేలా ఈ కామన్ మొబిలిటీ కార్డును తీసుకురావడంపై ఫోకస్ పెట్టారు. దీనికి అవసరమైన ఏజెన్సీని ఎంపిక చేయాలని అధికారులను  ఆదేశించారు. పలు మార్గాల ద్వారా ప్రయాణించే వారికి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని జోషి సూచించారు. కామన్ మొబిలిటీ కార్డు అందించే విషయంపై సంబంధిత అధికారులతో జోషి సమీక్షా సమావేశం  నిర్వహించారు.

మొబిలిటీ కార్డు కేవలం జర్నీలకే కాకుండా ఇతర అవసరాలకు కూడా యూజ్ అయ్యేలా ఉండాలన్నారు. క్యూఆర్‌ కోడ్, స్వైపింగ్‌ తదితర ఓపెన్‌ లూప్‌ టికెటింగ్‌ వ్యవస్థ ఉండేలా రూపొందించాలని ఆదేశించారు. కేంద్ర  ప్రభుత్వం సిఫార్సు చేసిన నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డు ప్రత్యేకతలపైనా అధికారులతో జోషి చర్చించారు. ఈ వార్త నగరవాసుల్లో ఆనందం నింపింది. ఆ కార్డు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.