కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్

  • Published By: madhu ,Published On : May 9, 2019 / 03:52 AM IST
కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టనున్నారు అధికారులు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉందనే సంగతి తెలిసిందే. ఈ కోడ్ ముగియగానే కార్యాచరణనను అధికారులు ప్రకటించనున్నారు. జూన్ 01వ తేదీ నుండి ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించనున్నారు. అర్హత ఉంటే కేవలం ఏడు రోజుల్లో కార్డులను జారీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందుకు పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ మే 08వ తేదీ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కార్డుల్లో ఎలాంటి జాప్యం చేయరాదని..నిర్లక్ష్యంగా వహిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకొనడం జరుగుతుందని హెచ్చరించారు. దీనితో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 85, 00, 345 కార్డులుంటే..రేషన్ దుకాణాలు 17 వేల 022 ఉన్నాయి. 2.75 మంది లబ్దిదారులున్నారు. 

ఇటీవలే శాఖ అధికారులు రేషన్ కార్డులను ప్రక్షాళన చేశారు. చాలా మంది కార్డులను తొలగించడంతో ప్రజల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరలా దరఖాస్తులు ఆహ్వానించారు. అప్పటి నుండి పెండింగ్‌లో పెడుతూ వచ్చారు. పెండింగ్‌లో ఉన్న వాటిని పరిష్కరించి..వేగవంతం చేయాలని పౌరసరఫరా శాఖ తాజాగా నిర్ణయించింది. దీనికి సంబంధించి నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ నియమించింది. HMDA పరిధికి సంబంధించి ఇద్దరు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మరో ఇద్దరు ఈ కమిటీలో ఉండనున్నారు. ఈ కమిటీ చేసే సిఫార్సులకనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయనుంది.

క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఆ దరఖాస్తులను DPSOలు, ACSOల లాగిన్‌కు వచ్చిన ఏడు రోజుల్లో కార్డుల ప్రక్రియ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. జిల్లా ప్రాజెక్టు అసోసియేట్‌ల సహకారంతో E-PDS పనులు పూర్తి చేయాలి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పెండింగ్ దరఖాస్తులు అధికంగా ఉన్నాయి. చీఫ్ రేషనింగ్ కార్యాలయం నుంచి సీనియర్ ఆఫీసర్‌లను విచారణ అధికారులుగా నియమించి త్వరితగతిన రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను మీ సేవ / ఈ సేవా కేంద్రాల్లో ఆపరేటర్లు స్కానింగ్ చేసి అప్‌లోడ్ చేయాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జూన్ 01వ తేదీ నుండి రేషన్ కార్డుల జారీ వేగవంతం చేయాలని ఆదేశించారు.