ప్రక్షాళన దిశగా : అర్హత లేని టీచర్లపై చర్యలు

  • Published By: madhu ,Published On : February 21, 2019 / 02:50 PM IST
ప్రక్షాళన దిశగా : అర్హత లేని టీచర్లపై చర్యలు

ప్రైవేటు స్కూళ్లలో ఎలాంటి అర్హత లేకున్నా పాఠాలు చెబుతున్నారా ? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఇలాంటి పంతుళ్లపై కొరడా ఝులిపించేందుకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి టీచర్ల వివరాలు సేకరించనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అర్హత గల వారిని మాత్రమే కొనసాగించేందుకు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో మొత్తం 42 వేల పాఠశాలలున్నాయి. వీటిలో 25 వేలు ప్రభుత్వ పాఠశాలు ఉంటే 12 వేల వరకు ప్రైవేట్‌ స్కూల్స్‌ ఉన్నాయి. మిగిలినవి గురుకులాలు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని స్కూళ్లు. 

సర్కార్‌ బడుల్లో టీచర్లంతా బీఈడీ, డీఈడీ, పండిట్స్‌గాప్ర శిక్షణ తీసుకున్నవారే ఉంటారు. ప్రైవేట్ పాఠశాలల్లో దాదాపు లక్ష మందికి పైగా టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో సగం మందికి కూడా బీఈడీ, డీఈడీ, టెట్‌ వంటి అర్హతలు ఉన్న దాఖలాలు లేవు. విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్‌ ట్రైనింగ్‌ తీసుకుని… టెట్ క్వాలిఫై అయిన వారిని మాత్రమే టీచర్లుగా కొనసాగించాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆదేశాలున్నా పట్టించుకొనేది ఎవరు ? అని టీచర్లు పాఠాలు బోధిస్తున్నారు. 

స్కూళ్లలో టీచర్ల వివరాలను సేకరించాలని తెలంగాణ విద్యాశాఖ తాజాగా నిర్ణయించింది. విద్యార్హతలను సేకరించనుంది. విద్యాశాఖ రూపొందించిన వెబ్‌సైట్‌ ద్వారా ఫిబ్రవరి 28 నుంచి టీచర్లు, సిబ్బంది వివరాలు సేకరించనుంది. దీనికి నెల రోజుల గడువు విధించింది. కొన్ని కార్పొరేట్‌ స్కూళ్లు ఒకే టీచర్‌తో రెండు, మూడు బడుల్లో పాఠాలు చెప్పిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఇలాంటి వాళ్లకు చెక్‌ పెట్టేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దీనిపై ప్రైవేట్ స్కూల్స్‌ యాజమాన్యాలు రెస్పాండ్ అయ్యాయి. తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నాయి. గతంలో కంటే ఇప్పుడు టీచర్‌ వృత్తిపై పలువురికి ఆసక్తి తగ్గిపోయిందని.. ప్రభుత్వం టీచింగ్‌ ఫీల్డ్‌పై మక్కువ పెంచే కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు. మొత్తానికి ఈ విద్యా సంవత్సరం నుంచైనా ప్రైవేట్‌ స్కూళ్లలో అనర్హులను ఏరి పారేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి ఇది ఎంతవరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.