ఆల్ రెడీ : రెండో పంచాయతీ సంగ్రామం

  • Published By: madhu ,Published On : January 24, 2019 / 01:50 PM IST
ఆల్ రెడీ : రెండో పంచాయతీ సంగ్రామం

హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా 3,342 పంచాయతీలకు జరిగే పోలింగ్‌కు  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్తు మధ్య జనవరి 25వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ముందుగా వార్డు సభ్యులకు పోలైన ఓట్లను లెక్కించి, ఆ తర్వాత సర్పంచ్‌ అభ్యర్థులకు పోలైన ఓట్లు లెక్కపెడతారు. ఎన్నికల విధుల కోసం నియమితులైన సిబ్బంది పోలింగ్‌ సామాగ్రి తీసుకుని తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. 
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ 

మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు 
మలి విడతలో 4,135 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ 
ఐదు గ్రామాలకు దాఖలుకాని నామినేషన్లు 
మొత్తం 788  పంచాయతీలు ఏకగ్రీవం 
పోలింగ్‌ జరిగే పంచాయతీలు 3,342
సర్పంచ్‌ పదవులకు 10,668 మంది పోటీ 

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. రెండో దఫా మొత్తం 4,135 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. వివిధ కారణాలతో ఐదు గ్రామాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో వీటికి ఎన్నికలు నిర్వహించడంలేదు. 788 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 3,342 గ్రామాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. సర్పంచ్‌ పదవులకు 10,668 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 
మొత్తం 36,602 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్‌ 

నామినేషన్లు దాఖలుకాని వార్డుల సంఖ్య 94
ఏకగ్రీవమైన వార్డులు 10,317 
ఎన్నికలు జరిగే వార్డులు 26,191 
వార్డు సభ్యుల పదవులకు 63,480 మంది పోటీ 

రెండో విడత పోలింగ్‌ జరిగే పంచాయతీల్లో వార్డు సభ్యుల పదవులకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 36 వేల 602 వార్డులకు  ఎన్నికల నోటిఫికేషన్‌ జారీచేస్తే.. 94 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. పదివేల 317 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 26 వేల 191 వార్డులకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. వార్డు సభ్యుల పదవులకు 63 వేల 480 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో విడత పోలింగ్‌ జరిగే పంచాయతీల్లో చాలా సున్నితమైన, కీలకమైన గ్రామాలు ఉండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 
అటు తొలి విడతలో ఉపయోగించిన బ్యాలెట్‌ పెట్టెలనే మలి విడతలో కూడా  వాడుతున్నారు. మొదటి విడత ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందే రెండో దఫా కూడా పోలింగ్‌ విధుల్లో ఉన్నారు. తొలి విడత  పోలింగ్‌లో తలెత్తిన లోపాలను దృష్టిలో పెట్టుకుని.. ఈసారి తప్పులు పునరావృతం కాకుండా ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంది.