పోల్ పల్లె : పోటెత్తిన ఓటు

  • Published By: madhu ,Published On : January 21, 2019 / 04:01 AM IST
పోల్ పల్లె : పోటెత్తిన ఓటు

హైదరాబాద్ : గ్రామాల్లో సందడి సందడి నెలకొంది.  ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుండి వారి వారి గ్రామాలకు తరలివెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తుది విడత పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 3,701 గ్రామాల్లో ఎన్నికలు  జరుగుతున్నాయి. 12,202 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. 28,976 వార్డులకు 70,094 మంది పోటీ పడుతున్నారు.జనవరి 21వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుండే పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని గ్రామాల్లో ఎన్నికల కోలాహాలం నెలకొంది. 
మంచిర్యాల జిల్లాలో
మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి (మం) బజ్జెరపల్లిలో పోలింగ్ నిలిచిపోయింది. 6గురు అభ్యర్థులకు గాను బ్యాలెట్ పేపర్‌పై 5గురు పేర్లు..గుర్తులు ఉండడంతో పోలింగ్ నిలిచిపోయింది. 
మహబూబ్ నగర్ జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఇక్కడ 122 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 468 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకు 595 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుండే పోలింగ్ ప్రారంభమైంది. తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు తరలివస్తున్నారు. ప్రతి గ్రామంలో ఎన్నికల కోలాహాలం నెలకొంది. ఎవరు గెలుస్తారనే దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 
ఖమ్మంలో
ఖమ్మంలో 174, కొత్తగూడెంలో 153 పంచాయతీలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మావోయిస్టు ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెంలో 22 పంచాయతీలను మావోయిస్టుల ప్రభావిత కేంద్రాలుగా గుర్తించారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
కరీంనగర్‌లో
జిల్లాలో 414 సర్పంచ్ స్థానాలు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 31 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 300 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారర. జగిత్యాల జిల్లాల్లోని అర్పన్ పల్లిలో పోలింగ్ కేంద్రానికి కేటాయించిన ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన నివాసంలో బస చేయకుండా వేరే దగ్గరకు వెళ్లడంతో ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు. వారి స్థానంలో ఇతరులను కేటాయించారు.