తెలంగాణలో మద్యం అమ్మకాలు: రెండు రోజుల్లో రూ.380 కోట్లు తాగేశారు

  • Published By: vamsi ,Published On : January 2, 2020 / 02:38 AM IST
తెలంగాణలో మద్యం అమ్మకాలు: రెండు రోజుల్లో రూ.380 కోట్లు తాగేశారు

ప్రపంచవ్యాపంగా కొత్త సంవత్సరంకి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. సంబరాలు అంబరాన్ని అంటాయి. అంగరంగ వైభవంగా జరిగిన కొత్త సంవత్సరం వేడుకల్లో ఆనందంతో పాటు మద్యం కూడా ఏరులైపారింది. కొత్త సంవత్సరం రోజున ప్రపంచంలో ఎక్కువమంది మద్యం సేవించినట్లుగా రిపోర్ట్‌లు చెబుతున్నాయి. కొత్త సంవత్సర సంధర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. మద్యం ధరలు పెరగడంతో అబ్కారీశాఖకు భారీగా ఆదాయం వచ్చి పడింది.

తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చెల్‌ జిల్లాల్లో డిసెంబరు నెల మొత్తం అమ్మకాలు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. తెలంగాణ వ్యాప్తంగా మద్యం అమ్మకాలకంటే ఈ మూడు జిల్లాల్లో అత్యధికంగా అమ్మినట్లుగా అబ్కారీశాఖ అధికారులు చెబుతున్నారు.

డిసెంబర్ నెల మొత్తం అమ్మకాలు సంగతి పక్కనబెడితే.. డిసెంబరు 30, 31 తేదీల్లో మద్యం అమ్మకాలు విపరీతంగా జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో డిసెంబరు 31న 2017లో రూ.60 కోట్ల మద్యం విక్రయాలు జరగగా.. 2018లో ఈ మొత్తం రూ.70 కోట్లను తాకింది. 2019 డిసెంబరు 30, 31 తేదీల్లో అమ్మకాలు రూ.180 కోట్లు జరిగాయని అంచనా వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో రూ.240 కోట్లు, మేడ్చల్‌ జిల్లాలో రూ.140 కోట్ల అమ్మకాలు డిసెంబరు 31న జరిగాయని అంచనా వేస్తున్నారు.

చివరి రెండురోజుల్లో.. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు 30, 31 తేదీల్లో రూ.380 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబరు నెలలో మొత్తం అమ్మకాలు రూ.2,050 కోట్ల అమ్మకాలు జరగగా.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చెల్‌ జిల్లాల్లో రూ.1060 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబరు 30, 31 తేదీల్లో రూ.560 కోట్ల మద్యం అమ్మారు.

డిసెంబరు నెల మొత్తానికి హైదరాబాద్‌ నగరంలో రూ.270 కోట్లు, రంగారెడ్డి జిల్లా పరిధిలో రూ.540 కోట్లు, మేడ్చెల్‌ జిల్లాలో దాదాపు 250కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. నగరంలో బీరుప్రియలు ఎక్కువయ్యారు. డిసెంబరు నెలలో మొత్తం 19లక్షల కేసుల బీర్లు అమ్ముడవ్వగా.. 1620 లక్షల లిక్కర్‌ కేసుల అమ్మకాలు జరిగాయి.