పంచాయతీ ఎన్నికలు : ఏ గుర్తులో తెలుసా

  • Published By: madhu ,Published On : January 4, 2019 / 01:02 AM IST
పంచాయతీ ఎన్నికలు : ఏ గుర్తులో తెలుసా

హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ఎన్నికల్లో సర్పంచ్, వార్డ్‌మెంబర్ల గుర్తులను ఎలక్షన్ కమిషన్ ఖరారు చేసింది.
సర్పంచ్ అభ్యర్థులకు ‘ఫ్రీ సింబల్స్’
టేబులు, బ్యాటరీ లైట్, క్యారెట్, ఉంగరం, కత్తెర, బ్యాట్, కొబ్బరికాయ, లేడీ పర్సు, మామిడికాయ, కప్పు – సాసర్, విమానం, బంతి, షటిల్ కాక్, కుర్చీ, వంకాయ, పలక, గొడ్డలి, గాలిబుడగ, బిస్కెట్, పిల్లన గ్రోవి, నల్లబోర్డు, సీసీ, బకెట్, బుట్ట, దువ్వెన, అరటి పండు, మంచము, ఫోర్కు, చెంచా.
వార్డు సభ్యులకు ‘ఫ్రీ సింబల్స్’
విద్యుత్ స్తంభం, పోస్టుబాక్స్, కటింగ్ ప్లేయర్, నీళ్ల జగ్గు, కవర్, హాకీ బ్యాట్, నెక్ టై, విల్లు – బాణం, గౌను, గ్యాస్ స్టా, స్టూలు, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, కుండ, గాజు గ్లాసు, యాంటెనా, గరాటా, మూకుడు, కెటిల్. 
నోటాకు గుర్తు : నమూనా బ్యాలెట్ పేపర్‌పై ‘కొటివేత మార్కు’తో ఉన్నదే నోటా గుర్తు. 
ప్రభుత్వ ఆర్డినెన్స్‌తో బీసీలకు అన్యాయం
ఎన్నికల నోటిఫికేషన్‌పై అభ్యంతరం
బీసీల రిజర్వేషన్ 34 నుంచి 22శాతానికి తగ్గించారు
షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్ట్‌
ఆర్డినెన్స్‌పై స్టే ఇవ్వలేమన్న కోర్ట్

పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ.. బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యతో పాటు మరి కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆర్డినెన్స్ ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ ప్రక్రియలో బీసీలకు అన్యాయం జరిగిందని, బీసీల రిజర్వేషన్‌ను 34 శాతం నుండి 22 శాతానికి తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 
జోక్యం చేసుకోలేమన్న కోర్టు…
ఇరు వాదనలు విన్న కోర్టు ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపధ్యంలో ఇప్పుడు తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్‌ను తాము నిలిపి వేయలేమని తేల్చి చెప్పింది. ఇక పిటిషనర్ లేవనెత్తిన అంశాలలో కొన్ని అభ్యంతరాలపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 
సర్పంచ్..వార్డు మెంబర్లకు గుర్తులు…
సర్పంచ్‌లకు 19 గుర్తులు, వార్డ్ మెంబర్లకు 20 గుర్తులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. నోటాకు సంబంధించి ఇంటూ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. అవసరమైతే మరిన్ని గుర్తులు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 21న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. జనవరి 25న రెండో విడత, జనవరి 30న మూడో విడత ఎన్నికలు జరుగుతాయి.