ఇంటర్ బోర్డులో దిద్దుబాటు చర్యలు : లెక్చరర్‌కు 5వేల ఫైన్

  • Published By: madhu ,Published On : April 29, 2019 / 01:07 AM IST
ఇంటర్ బోర్డులో దిద్దుబాటు చర్యలు : లెక్చరర్‌కు 5వేల ఫైన్

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన తర్వాత విద్యార్థుల ఆత్మహత్యల అంశం తీవ్ర దుమారం రేపింది. బోర్డు తప్పిదాల కారణంగానే చాలా మంది విద్యార్థులు ఫెయిలయ్యారంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలకు దిగారు. అటు విద్యార్థి సంఘాలు, రాజకీయ పక్షాలు కూడా బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆందోళనలు నిర్వహించాయి.

ఇంటర్‌ ఫలితాల్లో వచ్చిన తప్పులపై బోర్డు అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. CEC చదువుతున్న నవ్య అనే అమ్మాయికి తెలుగులో 99 మార్కులకు బదులు జీరో మార్కులు వేశారు. పేపర్‌ వ్యాల్యూయేషన్‌ చేసిన నారాయణ కళాశాల లెక్చరర్‌ ఉమాదేవికి…5వేల రూపాయల పెనాల్టీ విధించారు. 5వేల రూపాయలను లెక్చరర్ ఉమాదేవి…బోర్డ్‌ అధికారులకు చెల్లించారు. నారాయణ కళాశాల యాజమాన్యం లెక్చరర్‌ను విధుల నుంచి తొలగించినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. అలాగే… బబ్లింగ్‌లో పొరపాటు చేసిన మరో లెక్షరర్‌పైనా వేటు పడింది. 

ఫెయిల్ అయిన విద్యార్థులు నష్టపోవద్దనే ఉద్దేశ్యంతో… రీ వాల్యూయేషన్, రీ వెరిఫికేషన్ ఉచితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో.. ఆన్సర్ షీట్ల రీ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రీ వెరిఫికేషన్ ఫలితాలు వెలువడేందుకు సుమారుగా 15 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో.. సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. 

ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మే 16 నుంచి జరగాల్సిన సప్లిమెంటరీ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే… మే 25కు వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. మే 25 నుంచి జూన్‌ 4 వరకు పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జూన్ 7వ తేదీనుంచి 10 వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ ప్రాక్టీకల్స్‌ నిర్వహిస్తామన్నారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది.