సీఎం కేసీఆర్ స్పందించినా : ఆగని ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు

  • Published By: veegamteam ,Published On : April 25, 2019 / 04:13 AM IST
సీఎం కేసీఆర్ స్పందించినా : ఆగని ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు

ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పులు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 16మంది చనిపోయారు. బుధవారం (ఏప్రిల్  24,2019) మరో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. మెదక్‌ జిల్లా మడూరుకు చెందిన రమేశ్‌ (18) CEC సెకండియర్ లో ఎకనామిక్స్ (8 మార్కులు), సివిక్స్ (27  మార్కులు) సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. మనస్తాపం చెందిన రమేశ్‌ స్థానిక ప్రభుత్వ పాఠశాల గదిలో ఉరేసుకుని చనిపోయాడు. చేతికొచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో అతని తల్లిదండ్రులు  కన్నీరుమున్నీరవుతున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామానికి చెందిన ఆకారపు మితి (19) సెకండియర్ లో ఫిజిక్స్‌, జువాలజీ సబ్జెక్టుల్లో తప్పడంతో ఉరి వేసుకుంది. ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యం వల్లే తన  కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తండ్రి రవీందర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పత్తిపాక గ్రామానికి చెందిన సింధు ఇంటర్‌ ఫస్టియర్ లో ఫెయిలయ్యానన్న మనస్తాపంతో పురుగుల మందు తాగి  ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. సింధు పరిస్థితి విషమంగా ఉందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

సిద్దిపేట జిల్లా వెంకటాపూర్‌కు చెందిన తడ్కపల్లి అజయ్‌ ఇంటర్‌ ఫస్టియర్‌లో మ్యాథ్స్, కెమిస్ట్రీలో తప్పాడు. రిజల్స్ట్ వచ్చిన రోజు నుంచి మానసిక వేధనను అనుభవిస్తున్నాడు. పురుగుల మందు తాగి  ఆత్మహత్యాయత్నం చేశాడు. నిజామాబాద్‌ బాల్కొండలో ఆరెపల్లి శైలజ తనకు మార్కులు తక్కువగా వచ్చాయన్న కారణంతో ఆత్మహత్య చేసుకుంది. MPC చదివిన శైలజకు వెయ్యి మార్కులకు 847 మార్కులు  వచ్చాయి. కష్టానికి తగ్గ ఫలితం రాలేదన్న బాధతో శైలజ ఉరేసుకుంది.

ఇంటర్ ఫలితాల్లో అనేక తప్పులు జరిగాయి. పాస్ కావాల్సిన వారు ఫెయిల్ అయ్యారు. టాపర్లకు సున్నా మార్కులు ఇచ్చారు. మార్క్ లిస్ట్ లో అన్నీ మిస్టేక్సే. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు న్యాయం కోసం రోడ్డెక్కారు. 9 లక్షల మంది ఇంటర్ పరీక్షలు రాస్తే 3లక్షల మంది ఫెయిల్ అయ్యారు. ఇంటర్ ఫలితాల వివాదం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. దీంతో బుధవారం(ఏప్రిల్ 24,2019) సీఎం కేసీఆర్ స్పందించారు. ఇంటర్ బోర్డు వ్యవహారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఉచితంగా రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పాసయిన విద్యార్థులు కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోరుకుంటే గతంలోఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థుల ఆత్మహత్యలపైనా కేసీఆర్ స్పందించారు. ఆత్మహత్యలు బాధాకరం అన్నారు. అందరికి న్యాయం చేస్తామని, ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.