హైదరాబాద్‌లో TRS మరో బహిరంగసభ !

  • Published By: madhu ,Published On : April 1, 2019 / 08:40 AM IST
హైదరాబాద్‌లో TRS మరో బహిరంగసభ !

హైదరాబాద్‌‌లో TRS మరోసారి బహిరంగసభ నిర్వహించాలని యోచిస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీనితో రాష్ట్రంలో ఎన్నికల హీట్ నెలకొంది. ప్రధాన పార్టీల అధ్యక్షులు హైదరాబాద్‌లో బహిరంగసభలు నిర్వహిస్తూ..ఎన్నికల హీట్ పెంచేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగసభ ఫెయిల్ అయ్యిందని..జనాలు రాకపోవడంతో టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ హాజరు కాలేదని సోషల్ మీడియాలో ఉధృతంగా ప్రచారం జరిగింది. దీనితో మరోసారి సభను నిర్వహించి తమ సత్తా చాటాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. 

‘కారు – సారు – పదహారు’ అనే నినాదంతో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకపోతోంది. అయితే..మార్చి 26వ తేదీ శుక్రవారం LB స్టేడియంలో టీఆర్ఎస్ సభ నిర్వహించింది. ఈ సభకు ప్రజలు భారీగా తరలిరాలేదనే కారణంతో సీఎం కేసీఆర్ గైర్హాజర్ అయ్యారని ప్రచారం జరిగింది. జనాలు లేని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనితో TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. ఏప్రిల్ 01వ తేదీ సోమవారం హైదరాబాద్ కార్పొరేటర్లతో సమావేశం జరిపారు. మరోసారి గ్రేటర్ హైదరాబాద్‌లో బహిరంగసభ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చించారు. సభ సక్సెస్ అయ్యేందుకు కేటీఆర్ పలు సూచనలు చేశారు. ఏప్రిల్ 5వ తేదీ తరువాత సభ నిర్వహించాలని అనుకుంటున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.