విన్నపాలు వినవలె : కేంద్ర మంత్రులతో కేటీఆర్ సమావేశం

  • Published By: madhu ,Published On : October 31, 2019 / 03:09 PM IST
విన్నపాలు వినవలె : కేంద్ర మంత్రులతో కేటీఆర్ సమావేశం

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ హస్తిన పర్యటన కొనసాగుతోంది. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై స్పందించాలని, నిధులు కేటాయించాలని కోరారు. అక్టోబర్ 31వ తేదీ గురువారం సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశమయ్యారు. బేగంపేట సమీపంలోని రసూల్ పురా వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి SRDP కార్యక్రమం కింద కొంత స్థలాన్ని కేటాయించాలని షాను కోరారు కేటీఆర్. ఇంటర్ స్టేట్ పోలీస్ వైర్ లెస్ స్టాఫ్ క్వార్టర్స్‌కి చెందిన 1.62 ఎకరాల స్థలాన్ని GHMCకి ఇవ్వాలని, దీనికి ప్రత్యామ్నాయంగా మరోస్థలంలో క్వార్టర్స్ నిర్మించి ఇస్తామన్నారు. 

అంతకుముందు రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ‌తో సమావేశమయ్యారు. రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీకి ఏర్పాటుకు సహకారం అందించాలని, నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మ్యానిఫ్యాక్చరింగ్ జోన్ కింద ఫార్మా సిటీ ఏర్పాటుకు డీపీఐఐటీ కింద నిధులు సమకూర్చాలని కోరారు. ఖమ్మం జిల్లాలో గ్రానైట్ రవాణా కోసం రైల్వే సైడింగ్ సదుపాయం కల్పించాలని, విజయవాడ నుంచి నల్గొండ మీదుగా హైదరాబాద్‌కు రోజువారి పాసింజర్ రైలు నడపాలని మంత్రి కేటీఆర్ కోరారు. 

2019, అక్టోబర్ 30వ తేదీన ఢిల్లీకి మంత్రి కేటీఆర్ వెళ్లారు. రాష్ట్రాల ఐటీ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిశారు. బుధవారం సౌత్ బ్లాక్‌కు వెళ్లిన మంత్రి కేటీఆర్..రాజ్ నాథ్ సింగ్‌‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్ – నాగ్ పూర్, హైదరాబాద్ – రామగుండం జాతీయ రహదారులను విస్తరించడానికి నగరంలోని రక్షణ శాఖ భూములను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
Read More : కరీంనగర్‌లో హైటెన్షన్ : చర్చలు జరిపితేనే..డ్రైవర్ బాబు అంత్యక్రియలు