ఆర్టీసీ సమ్మె అఖిలపక్ష సమావేశం : తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తాం

  • Published By: madhu ,Published On : October 9, 2019 / 07:57 AM IST
ఆర్టీసీ సమ్మె అఖిలపక్ష సమావేశం : తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తాం

సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారు..ప్రజా రవాణాను బతికించుకోవడానికి తమ పోరాటం.. 7 వేల మంది కార్మికులు రిటైర్డ్ అయినా..ఖాళీలను భర్తీ చేయలేదు..మేం దాచుకున్న రూ. 2 వేల 400 కోట్లు వాడుకున్నారు..ప్రభుత్వం దిగిరాకపోతే..త్వరలో తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామన్నారు టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామ రెడ్డి. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వ తీరును అఖిలపక్షం, ఆర్టీసీ జేఏసీ ఖండించింది. 

ఆర్టీసీ సమ్మెపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. అఖిలపక్ష సమావేశానికి ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. టీజేఎస్ నేత కోదండరాం అధ్యక్షతన 2019, అక్టోబర్ 09వ తేదీన ఈ మీటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా అశ్వత్ధామ రెడ్డి మాట్లాడుతూ…ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను వాడుకొందని, ఇవి ఇవ్వడం లేదన్నారు. రూ. 2 వేల 400 కోట్లు ఇస్తే ఆర్టీసీకి ఇబ్బంది ఉండదన్నారు. డీజిల్ ధర రూ. 30 పెరిగిందని, దీంతోపాటు ట్రాన్స్ పోర్టు వ్యవస్థలో డీజిల్‌పై ట్యాక్స్ విధిస్తున్నారన్నారు. ఆర్టీసీలో 27 శాతం పన్ను ఉందన్నారు. కొన్ని ట్యాక్స్‌లు తగ్గిస్తామని..గతంలో సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. తమ కోసం ఆర్టీసీ సమ్మె చేపట్టడం లేదని, సంస్థ కోసం చేస్తున్నట్లు వెల్లడించారు.  

ఇప్పటికే ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటించాయి. భవిష్యత్‌ కార్యాచరణను ఆర్టీసీ జేఏసీ ప్రకటించనుంది. 26 డిమాండ్లతో పాటు విలీనంపై కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు.. ఈ సమావేశానికి పలువుర కార్మికులు పాత పే స్లిప్పులతో హాజరయ్యారు.
Read More : బీ అలర్ట్  : హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన