రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె…మెట్రో ఫుల్

  • Published By: venkaiahnaidu ,Published On : October 6, 2019 / 04:32 AM IST
రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె…మెట్రో ఫుల్

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్‌ ముగిసేసరికి దాదాపు 50 వేల మంది ఉద్యోగుల్లో 160 మంది మాత్రమే విధుల్లో చేరారు. ఎక్కడికక్కడ పోలీసులను మోహరించి.. పటిష్ఠ బందోబస్తు మధ్య ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా.. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు.

దసరా, బతుకమ్మ పండుగల ముందు ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్లలోనే గంటలకొద్దీ పడిగాపులు కాశారు. ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు భారీగా టిక్కెట్ ధరలనుయ పెంచారు. రెండు, మూడు రెట్లు పెంచి వసూలు చేశారు. డిపో నుంచి ఒక్క బస్సు కూడా కదలలేదని, సమ్మె 100 శాతం విజయవంతమైందని కార్మిక జేఏసీ ప్రకటిస్తే.. 9000కుపైగా బస్సులను నడిపామని, ప్రయాణికులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూశామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక, సమ్మెపై సీఎం కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం సమీక్షించనున్నారు.

సమ్మె కారణంగా హైదరాబాద్ లో మెట్రోకి రద్దీ విపరీతంగా పెరిగింది. రికార్డు స్థాయిలో ప్రజలు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. శనివారం నుంచి వేల సంఖ్యలో ప్రజలు మెట్రోలు గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. శనివారం ఒక్కరోజే 3.65లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు. రైల్వేస్టేషన్లకు భారీగా క్యూ కడుతున్నారు.