మండుతున్న తెలంగాణ  : త్వరలో 46 ఏళ్ల రికార్డ్ బ్రేక్

  • Published By: veegamteam ,Published On : May 8, 2019 / 03:44 AM IST
మండుతున్న తెలంగాణ  : త్వరలో 46 ఏళ్ల రికార్డ్ బ్రేక్

తెలుగు రాష్ట్రాల ప్రజలను భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. భగభగలాడే ఎండలతో మంటపెడుతున్నాడు. నిప్పుల గుండంలా మండిపోతున్నాయి తెలుగు రాష్ట్రాలు. ఉష్ణోగ్రతల్లో గత రికార్డులు బ్రేక్ అయ్యేలా వేడెక్కిస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఎండలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. 50 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. 
 

తెలంగాణలో ఇప్పటివరకు అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు 48.6 డిగ్రీలు. 1973 మే 9న ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2019లో తెలంగాణలో ఇప్పటివరకు 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగితే.. 46ఏళ్ల రికార్డు బ్రేక్ అయ్యే పరిస్థితి కనిపిస్తోందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. 

2016లో 27 రోజులు, 2017లో 23 రోజులు, 2018లో 7రోజులు మాత్రమే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మారిన వాతావరణ పరిస్థితులతో  2019లో వారం పది రోజులుగా రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. మే నెల రెండో వారం నుంచి ఎండలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుండటంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. రానున్న మూడు రోజుల్లో ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వడగాలుల దెబ్బకు 20మంది ప్రాణాలు కోల్పోయారు.