జగన్ సర్కార్ ఎఫెక్ట్ : TSRTCలో సమ్మె సైరన్!

  • Published By: madhu ,Published On : September 7, 2019 / 12:48 PM IST
జగన్ సర్కార్ ఎఫెక్ట్ : TSRTCలో సమ్మె సైరన్!

APSRTC విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో ప్రకంపనలు రేకేత్తిస్తున్నాయి. అక్కడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీఎస్ఆర్టీసీలో మరోసారి సమ్మె రాగాలు మొదలయ్యాయి. ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. సిబ్బందికి కనీసం వేతనాలు చెల్లించలేక..నష్టాల్లో ఆర్టీసీ ఉన్న సంగతి తెలిసిందే. కానీ దీనికి యాజమాన్యమే కారణమంటూ కార్మికులు ఆరోపిస్తున్నారు. మరోసారి సమ్మెలోకి వెళుతారా అనే చర్చ జరుగుతోంది. 

2017తో ముగిసిన వేతన సవరణ ఒప్పందాన్ని పునరుద్ధరించటంలో జరుగుతున్న జాప్యంపై మండిపడుతున్నారు కార్మికులు. వీటితో పాటు RTC అంతర్గత నియామకాలు, డ్రైవర్, కండక్టర్లకు ఉద్యోగ భద్రత లాంటి మరో 12 డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్, ఎంప్లాయీస్‌ యూనియన్లు నోటీసులు ఇచ్చాయి. గుర్తింపు పొందిన కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ సమ్మెకు రెడీ అవుతోంది. మరో ప్రధాన కార్మిక సంఘం నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ ఇప్పటికే సమ్మె నోటీసును ఆర్టీసి యాజమాన్యానికి అందజేసింది. దాదాపు అన్ని ప్రధాన కార్మిక సంఘాలు సమ్మెకు సై అంటున్నాయి. దీంతో ఆర్టీసీలో సమ్మె పక్కా అని తెలుస్తోంది. 

TSRTCలో ప్రధానంగా వేతన సవరణ డిమాండ్‌ వినిపిస్తోంది. 2015లో సిబ్బందికి ప్రభుత్వం భారీ వేతన సవరణను ప్రకటించింది. అనూహ్యంగా 44 శాతం ఫిట్‌మెంట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అంతభారీగా ఇవ్వటం పట్ల కార్మిక సంఘాలు అప్పట్లో ఆశ్చర్యపోయాయి. అప్పటి వేతన సవరణ ఒప్పందం 2017తో ముగిసింది. తర్వాత ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ ప్రకటించకుండా 27 శాతం తాత్కాలిక భృతి ఇచ్చింది. రెండేళ్లు కావస్తున్నా.. ఫిట్‌మెంట్‌ ఊసు లేకపోవడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆర్టీసీ విలీనం అంశం కనుమరుగైపోయింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంపై ఇప్పుడు కార్మిక సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. మరి వీరి ఆందోళనపై టి.సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.