చెక్ ఇట్ : హైదరాబాద్ ఆటోలపై మై ఆటో సేఫ్ స్టిక్కర్లు

చెక్ ఇట్ : హైదరాబాద్ ఆటోలపై మై ఆటో సేఫ్ స్టిక్కర్లు

హైదరాబాద్‌లోని ట్రాఫిక్ పోలీసు వ్యవస్థ చూపించుకోవడానికే పని చేస్తుందా.. ప్రజలకు ఉపయోగపడేందుకు కష్టపడుతుందా.. అర్థం కాని పరిస్థితి. నగరంలోని ఆటోలకు మై ఆటో సేఫ్ స్టిక్కర్లు అంటిస్తున్నారు. వీటికి అర్థం ఆటోను చెక్ చేసి డ్రైవర్ దీనికి సంబంధించిన వాడే.. రవాణాకు ఏ మాత్రం డోకా లేదని ట్రాఫిక్ పోలీసు వారే నమ్మకమిస్తున్నట్లు అన్నమాట. కానీ, ట్రాఫిక్ పోటీసులు ఎలా నిర్థారిస్తున్నారో అర్థం కావట్లేదు. 

 

ఇందుకోసం పోలీసులు ఆటోల వివరాలను, వాటిని నడిపే డ్రైవర్ల వివరాలను నమోదు చేసుకుని ‘మై ఆటో సేఫ్‌’ స్టిక్కర్‌ను అతికించాలి. సహజంగానే ఇలాంటి స్టిక్కర్‌ ఉన్న ఆటోలు సురక్షితమైనవేనని ప్రయాణికులు కూడా భావిస్తారు. నమ్మకంతో  ప్రయాణం చేసేందుకు ఆటోలు ఎక్కుతారు. కానీ గ్రేటర్‌ హైదరాబాద్‌లో తిరుగుతున్న సుమారు లక్షా 40వేల ఆటోల్లో 70 శాతానికి పైగా ఫైనాన్షియర్ల గుప్పిట్లోనే ఉన్నాయి. అలాంటి ఆటో రిక్షాలను ఫైనాన్సర్లు కేవలం అగ్రిమెంట్లపై విక్రయిస్తున్నారు. ఇలాంటి ఒప్పందాల ప్రాతిపదికపై ఒకే ఆటోను నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మందికి విక్రయిస్తారు.

ఇలా చేస్తే ఏ ఆటో ఎవరి పేరు మీద ఉందో తెలియని పరిస్థితి. ఎలాంటి చట్టబద్ధత లేని ఈ అగ్రిమెంట్లపై ఫైనాన్సర్లు వందల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారాన్ని సాగిస్తుండగా, ఈ బినామీ పేర్ల ఆధారంగానే పోలీసులు ఆటోల భద్రతపై దృష్టి సారిస్తున్నారు. ఒరిజినల్‌ పర్మిట్లు, రిజిస్ట్రేషన్‌ పత్రాలను ఫైనాన్షియర్లు వారి వద్దనే ఉంచుకొని కేవలం అగ్రిమెంట్లపైనే ఆటోలను విక్రయిస్తున్నారు. ఇలా ఒక్కో ఆటో ఎంతోమంది చేతులు మారుతోంది. ఇలాంటి ఆటోలు ప్రమాదాలకు గురైనప్పుడు, అనూహ్యమైన ఘటనలు చోటుచేసుకున్నప్పుడు ఆటో పత్రాల ఆధారంగా నిందితులను గుర్తించడం అసాధ్యం. ఇవేమీ పట్టించుకోకుండానే పోలీసులు ‘మై ఆటో సేఫ్‌’ స్టిక్కర్లను అతికిస్తున్నారు. 

ఇలాంటి ఆటోల్లో భద్రత అంటే ఎలా?
ఆటోల్లో మీటర్‌ రీడింగ్‌లు ఉండవు. ఒకవేళ పెట్టారా స్పెషల్ ఎరేంజెమెంట్స్‌తో తప్పుడు రీడింగ్‌లు కనిపిస్తుంటాయి. ఫలితంగా డ్రైవర్లు అడిగినంతా మారు మాట్లాడకుండా చెల్లించాల్సిందే. ప్రయాణికులపై బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు గుంజుకుంటారు. మహా నగరంలోని కొన్ని కీలక ప్రదేశాల్లో అయితే భద్రత నామమాత్రమే. ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, బేగంపేట్, హైటెక్‌సిటీ, మైత్రివనం వంటి ప్రాంతాల నుంచి రాత్రి వేళల్లో ఆటోల్లో ప్రయాణం చేయడమంటే రిస్కుతో కూడుకున్న పనే. సురక్షితంగా ఇంటికి చేరతామో లేదో తెలియని పరిస్థితి. చాలా చోట్ల ఆటోడ్రైవర్ల రూపంలోనే అసాంఘిక శక్తులు కనిపిస్తున్నాయి. నిజమైన యజమాని నిర్ధారణ లేని, చట్టబద్ధమైన గుర్తింపు పత్రాలు లేని ఇలాంటి ఆటోల్లో ‘మై ఆటో సేఫ్‌’ స్టిక్కర్లు భద్రతను ఇస్తాయని సగటు ప్రయాణికుడు ఎలా నమ్ముతాడో హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థకే తెలియాలి.